Jamili Elections: ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు

జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలను కొనాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం-EC తెలిపింది. అందుకు 10వేల కోట్ల రూపాయల మేర ఖర్చవుతుందని అంచనా వేసింది. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని ఆలోచన చేస్తున్న కేంద్రం... గతంలో ఎన్నికల సంఘానికి ప్రశ్నావళిని పంపింది. వాటికి సమాధానం పంపిన ఈసీ... లోక్‌సభ, శాసనసభ స్థానాలకు వేర్వేరుగా ప్రతి పోలింగ్‌కు రెండుసెట్ల ఈవీఎంలు అవసరం అవుతాయని స్పష్టం చేసింది. ఈ లెక్కన... జమిలి ఎన్నికలకు వెళ్లిన ప్రతి 15ఏళ్లకు ఒకసారి కొత్త ఈవీఎంలు అవసరం అవుతాయని ఈసీ పేర్కొంది. ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలంటే అదనపు పోలింగ్ కేంద్రాలు, భద్రతా సిబ్బంది, ఈవీఎంల స్టోరేజీ సదుపాయాలు, మరిన్ని వాహనాలు అవసరం అవుతాయని ఈసీ తెలిపింది. ఇత్యాది అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... 2029 నుంచే జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందని అభిప్రాయపడిన ఎన్నికల సంఘం...అందుకోసం రాజ్యాంగంలోని 5 అధికరణాలను సవరించాల్సి ఉంటుందని గుర్తుచేసింది.
ఈ ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలకు 11.80 లక్షల పోలింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నామంది. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఒక్కో పోలింగ్ బూత్‌కు రెండు సెట్ల ఈవీఎంలు అవసరమవుతాయని, అందులో ఒకదానిని లోక్‌సభకు, రెండో దానిని అసెంబ్లీ పోలింగ్‌కు వినియోగిస్తామన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్ తేదీన కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్ మిషన్లు కొన్ని రిజర్వ్‌లో ఉంచాలన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జమిలి ఎన్నికలకు కనీసం 46,75,100 బీయూలు, 33,63,300 సీయూలు, 36,62,600 వీవీప్యాట్‌లు అవసరమవుతాయని వివరించింది.
2023 ప్రారంభంలో బియు ధర రూ.7,900, సియు ధర రూ. 9,800, వివిపిఎటి ధర రూ. 16,000గా ఉంది. ఇవిఎంల ధరతో పాటు పోలింగ్, భద్రతా సిబ్బంది కోసం, ఇవిఎంలు దాచి ఉంచడానికి, వాహనాలకు, రవాణాకు అదనంగా మరింత వ్యయం అవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. అన్నీ అనుకూలంగా ఉన్నా 2029లో మాత్రమే జమిలి ఎన్నికలు నిర్వహించగలమని ఎన్నికల కమిషన్ తెలిపింది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగంలోని ఐదు ఆర్టికల్స్‌కు సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పార్లమెంటు సభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 83, లోక్‌సభను రాష్ట్రపతి రద్దు చేయడానికి సంబంధించిన ఆర్టికల్ 85, రాష్ట్ర శాసనసభల కాలవ్యవధికి సంబంధించిన ఆర్టికల్ 172, రాష్ట్రాల శాసనసభల రద్దుకు సంబంధించిన ఆర్టికల్ 174, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి సంబంధించిన ఆర్టికల్ 356కు సవరణ చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది. పార్టీ ఫిరాయింపులపై అనర్హతకు సంబంధించిన రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో కూడా కొన్ని అవసరమైన మార్పులు చేయాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com