Exit Poll Result: మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్..

Exit Poll Result: మరికొద్ది గంటల్లో ఎగ్జిట్ పోల్స్..
కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం

పోలింగ్ ముగిసిన అరగంట తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకు ముందే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తి కాగా, నేడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అయితే తొలుత గురువారం సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ఎన్నికల సంఘం సూచించినప్పటికీ తాజాగా ఆ సమయాన్ని సవరించింది. సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవ్వొచ్చని తాజాగా ప్రకటించింది.

దేశంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ముగిశాయి. మిగిలిన చివరి తెలంగాణ ఎన్నికలు కూడా కాస్సేపట్లో ముగియనున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఉద.యం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ జరగనుంది. సమస్యాత్మక నియోజకవర్గాలైన 13 స్థానాల్లో మాత్రం గంట ముందే అంటే సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. తెలంగాణ పోలింగ్ ముగియగానే మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి చేసేందుకు వివిధ సర్వే సంస్థలు నిరీక్షిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్పులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

వాస్తవానికి పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే సాయంత్రం 6:30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని అక్టోబర్ 31న తొలుత ఆదేశించింది. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5 గంటలకే ముగుస్తుండడంతో మరో గంట ముందుగానే అంటే సాయంత్రం 5:30 గంటలకే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. దీంతో ఈరోజు సాయంత్రం 5:30 తరువాత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story