Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. ఈసారి రూ.1,120 కోట్ల ఆస్తుల అటాచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. యస్ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ, ఈరోజు రిలయన్స్ గ్రూప్‌కు చెందిన రూ.1,120 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL)లలో జరిగిన నిధుల మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈడీ జప్తు చేసిన ఆస్తులలో స్థిరాస్తులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు, అన్‌కోటెడ్ ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి. ఈ తాజా అటాచ్‌మెంట్‌తో ఈ కేసులో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.9,000 కోట్లకు చేరింది. అక్టోబర్ నుంచి ఇప్పటివరకు రూ.7,800 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్ సహా పలు గ్రూప్ కంపెనీలకు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ముంబై, ఢిల్లీ, పుణె, చెన్నై వంటి నగరాల్లోని నివాస, వాణిజ్య భవనాలు, భూములు ఇందులో ఉన్నాయి.
ఆర్‌హెచ్ఎఫ్ఎల్, ఆర్‌సీఎఫ్ఎల్ కంపెనీలు సేకరించిన ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారన్న సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. 2017-19 మధ్య యస్ బ్యాంక్ ఈ రెండు సంస్థలలో వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అయితే, సెబీ నిబంధనలకు విరుద్ధంగా, తిరిగి ఈ నిధులను అంబానీ గ్రూప్ కంపెనీలకే మళ్లించి పాత అప్పులు తీర్చేందుకు (ఎవర్‌గ్రీనింగ్) వాడారని ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ తాజా పరిణామాలపై అనిల్ అంబానీ గ్రూప్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

