Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో 4 రోజుల కస్టడీ

Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు మరో 4 రోజుల కస్టడీ
స్వయంగా వాదనలు వినిపించిన సీఎం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీని ఢిల్లీలోని రౌస్‌అవెన్యూ కోర్టు మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరుచాలని ఈడీని ఆదేశించింది. గతంలో విధించిన ఏడు రోజుల కస్టడీ గురువారం ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను న్యాయస్థానంలో హాజరుపరిచారు. దర్యాప్తు సమయంలో కేజ్రీవాల్‌ తప్పించుకునే ధోరణిలో సమాధానాలు చెప్పారని, డిజిటల్‌ డివైజ్‌ల పాస్‌వర్డ్‌లను కూడా చెప్పలేదని ఈడీ ఆరోపించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులతో కలిపి ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని చెబుతూ.. మరో ఏడు రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. అయితే, కోర్టు నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. కాగా అంతకు ముందు కేజ్రీవాల్‌ స్వయంగా కోర్టులో తన వాదనలు వినిపించారు.

కోర్టులో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘దేశ ప్రజల ముందు ఆప్‌ను ఓ అవినీతి పార్టీగా చిత్రీకరించి, నాశనం చేయడానికి ఈడీ తొలి నుంచీ ప్రయత్నిస్తున్నది. నన్ను అరెస్టు చేసినప్పటి నుంచీ వాళ్లు (ఈడీ) చెబుతున్న రూ. 100 కోట్లను ఇంతవరకూ పట్టుకోలేదు. మద్యం కేసులో నన్ను అరెస్టు మాత్రమే చేశారు. అయితే నేను తప్పు చేశానని ఏ కోర్టులోనూ రుజువుకాలేదు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ 31 వేల పేజీల ఛార్జ్‌షీట్‌, ఈడీ మరో 25 వేల పేజీల ఛార్జ్‌షీట్లను సమర్పించాయి. అయితే, వాటిని క్షుణ్ణంగా చదివిన తర్వాత కూడా నన్ను ఎందుకు అరెస్టు చేశారన్న ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకట్లేదు. ఇన్ని వేల పేజీల ఛార్జ్‌షీట్లలో నా పేరును నాలుగుసార్లు మాత్రమే ప్రస్తావించారు. అక్కడ కూడా అరవింద్‌ కేజ్రీవాల్‌ అని కాకుండా సీ అరవింద్‌ అని రాసి ఉంది. నిజానికి సీ అరవింద్‌ అనే వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కార్యదర్శి. ఈడీ విచారణలో కూడా.. నాకు సిసోడియా కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చాడని సదరు అరవింద్‌ చెప్పాడు. నాకు రోజూ ఎందరో ఎమ్మెల్యేలు ఎన్నో డాక్యుమెంట్లు ఇస్తారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో ఇదో భాగం. నా పేరును నలుగురు సాక్షులు ప్రస్తావించినట్టు ఈడీ చెప్తున్నది. ఒక సీఎంను అరెస్టు చేసేందుకు ఈ నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా? ఈడీ చెప్తున్నట్టు ఒకవేళ నిజంగా కుంభకోణం జరిగితే, ఆ రూ. 100 కోట్ల డబ్బు ఏది? ఎక్కడ? ఏదేమైనా ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు నేను సిద్ధమే’ అని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story