National Herald: సోనియా ఇంటి వద్ద భారీగా పోలీసులు.. నేషనల్ హెరాల్డ్ కేసులో..

National Herald: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీలోని యంగ్ ఇండియన్ సంస్థ ఆఫీస్‌ను తాత్కాలికంగా సీల్ చేశారు ఈడీ అధికారులు. నిన్నటి నుంచి ఢిల్లీ, లఖ్‌నవూ, కోల్‌కతాలో 10 నుంచి 12 చోట్ల అనేక గంటలపాటు సోదాలు జరిపిన ఈడీ.. యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. తమ పర్మిషన్ లేకుండా యంగ్ ఇండియన్ ఆఫీస్ గేట్లు ఎవరూ తెరవకూడదని స్పష్టం చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, జన్‌పథ్‌లోని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వద్ద భారీ సంఖ్యలో మోహరించారు.
కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు.
ఈ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పవన్ బన్సల్‌లను ఈడీ ప్రశ్నించింది. మూడు రోజుల విచారణలో భాగంగా సోనియాకు వందకు పైగా ప్రశ్నలు సంధించింది. ఏజేఎల్, యంగ్ ఇండియన్ మధ్యలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై సోనియాను ప్రశ్నించగా.. అవన్నీ మోతీలాల్ వోరాకే తెలుసని ఆమె చెప్పినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా.. మధ్యప్రదేశ్ సీఎంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా, ఆలిండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అనేక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగానూ వ్యవహరించారు. 2020 డిసెంబరులో ఆయన అనారోగ్యంతో చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com