Arvind Kejriwal:అరవింద్ కేజ్రీవాల్‌పై కోర్టుకెళ్లిన ఈడీ..

ఢిల్లీ మద్యం విధానం వ్యవహారానికి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసు శనివారం అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఐదుసార్లు సమన్లు జారీచేయగా.. ఒక్కసారి కూడా ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈడీ కోర్టును ఆశ్రయించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో పీఎంఎల్-2002 సెక్షన్ 50 కింద ఈడీ ఫిర్యాదు చేసింది. తాము పంపిన సమన్లను ఆయన లెక్కచేయడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.
ఈడీ పిటిషన్‌ను రౌజ్ అవెన్యూ కోర్టు విచారణకు స్వీకరించింది. కేసుకు సంబంధించి ఈడీ సమర్పించిన కొన్ని సబ్మిషన్‌లను ఇవాళ (ఆదివారం) పరిశీలించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు మనీష్‌సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.
ఈ పిటిషన్‌పై శనివారం వాదనలు విన్న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్వ మల్హోత్రా.. మిగతా ఫిర్యాదులపై ఫిబ్రవరి 7న పరిశీలించాలని నిర్ణయించారు. 2021లో రూపొందించిన ఢిల్లీ నూతన మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇప్పటికే పలువుర్ని ఈడీ అరెస్ట్ చేసింది. వీరిలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ మంత్రి సంజయ్ సింగ్‌లు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ను కూడా విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది.
మొదటిసారి గతేడాది నవంబరు 2న సమన్ల పంపింది.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏకంగా ఐదుసార్లు సమన్లు జారీచేసినా.. కేజ్రీవాల్ మాత్రం గైర్హాజరవుతూనే ఉన్నారు. చివరిగా ఫిబ్రవరి 2న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ, ఈసారి కూడా విచారణకు గైర్హారజరయ్యారు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని ఆప్ ఆరోపిస్తోంది. మద్యం విధానానికి సంబంధించి కేజ్రీవాల్ స్టేట్‌మెంట్ రికార్డు చేయాలని ఈడీ భావిస్తోంది.
ఇదే కేసులో గత ఏడాది ఫిబ్రవరి 26న ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియాను పలుసార్లు ప్రశ్నించి అరెస్టు చేయగా.. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను గత అక్టోబర్ 5న ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలో తనను అరెస్ట్ చేయడానికే కుట్రలు చేస్తున్నారని, తమ ప్రభుత్వాన్ని కూలదోయడమే మోదీ లక్ష్యమని, దానికి మేము అనుమతించబోమని కేజ్రీవాల్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com