Sonia Gandhi: తొలిరోజు ఈడీ ముందుకు సోనియా.. మూడు గంటల పాటు విచారణ..

Sonia Gandhi: తొలిరోజు ఈడీ ముందుకు సోనియా.. మూడు గంటల పాటు విచారణ..
Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిరోజు ఈడీ విచారణ ముగిసింది.

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్‌ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తొలిరోజు ఈడీ విచారణ ముగిసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాదాపు మూడు గంటలపాటు విచారించింది. తొలి సారి ఈడీ ముందుకు వచ్చిన సోనియా గాంధీని అదనపు డైరెక్టర్‌ స్థాయి మహిళా అధికారి నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. మొత్తం 20 ప్రశ్నలడిగినట్లు సమాచారం. ఆరోగ్య కారణాలతో సోనియా చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు.

ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అనారోగ్య కారణాలతో ఇన్నాళ్లు విచారణకు హాజరుకాని సోనియా గాంధీ.. ఎట్టకేలకు ఈ రోజు ఈడీ ముందుకు వచ్చారు. కుమార్తె ప్రియాంకతో కలిసి మధ్యాహ్నం తన నివాసం నుంచి బయల్దేరిన సోనియా.. ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ తర్వాత సోనియా ఒక్కరే విచారణ గదిలోకి వెళ్లారు. రాహుల్‌ గాంధీకూడా ఈడీ కార్యాలయానికి వచ్చి కాసేపటి తర్వాత వెళ్లిపోయారు.

కోవిడ్‌ అనంతర సమస్యలతో బాధపడుతున్న సోనియా గాంధీకి సహాయంగా ప్రియాంకను ఈడీ అనుమతించింది. అయితే విచారణ గది కాకుండా.. మరో గదిలో ఉండేందుకు ప్రియాంకను అనుమతించారు. సోనియా అనారోగ్య పరిస్థితుల నేపథ్యంలో ఓ మహిళా డాక్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇప్పటికే రాహుల్ గాంధీని ఇదే కేసులో అయిదు రోజుల పాటు దాదాపు 55 గంటలకు పైగా విచారించిన ఈడీ బృందం.. సోనియాను కూడా తొలి రోజు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. రాహుల్‌ వెల్లడించిన అంశాలతోనే మరిన్ని ప్రశ్నలు వేసి మనీ ల్యాండరింగ్‌ అంశంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

కాగా సోనియా గాంధీకి మద్దతుగా కాంగ్రెస్‌ శ్రేణులు దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. ఈడీ కార్యాలయాల ముందు నిరసనలతో హోరెత్తించారు. మరోవైపు సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ.. కాంగ్రెస్​ కార్యకర్తలు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్​ వెలుపల, లోపల కూడా స్టాప్‌ ఈడీ విచారణ అంటూ ప్లకార్డులు పట్టుకొని కాంగ్రెస్​ ఎంపీలు.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు.. విపక్షాలు కూడా దీనిపై ఓ ప్రకటన విడుదల చేశాయి. కొన్ని పార్టీల ప్రముఖ నేతలే లక్ష్యంగా ప్రయోగిస్తూ.. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డాయి.

Tags

Read MoreRead Less
Next Story