ED: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోంమంత్రికి బిగుస్తున్న ఉచ్చు..

బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు స్పెషల్ న్యాయస్థానం ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరుచేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధించి కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వరతో సంబంధం ఉన్న శ్రీ సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య కళాశాలపై బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. ఈ కళాశాలకు ఆయన ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ కేసులో రన్యారావుకు, కళాశాలకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని.. ఇందులోభాగంగానే కళాశాలకు చెందిన ఆర్థిక రికార్డులను పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
రన్యారావు స్మగ్లింగ్ కేసులో రాజకీయ నేతల హస్తం ఉందనే అనుమానంతో ఇటీవల జరిగిన ఆమె వివాహానికి హాజరైన వ్యక్తులు, ఆమెతో సంబంధమున్న రాజకీయ నేతలను గుర్తించేందుకు నటి పెళ్లికి హాజరైన అతిథులు, వారిచ్చిన కానుకలపై అధికారులు దర్యాప్తు చేస్తుండగా ఆమె వివాహ ఫొటోలలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, హోంశాఖ మంత్రి జి.పరమేశ్వర కూడా ఉండడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో హోంమంత్రితో సంబంధమున్న కళాశాలపై ఈడీ దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావు కొన్నిరోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆమె నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా తేలడంతో రన్యారావుతో పాటు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజును అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం వారు వేసిన పిటిషన్‌పై తీర్పు రిజర్వు చేసిన కర్ణాటక హైకోర్టు దానిని కొట్టివేసింది. దీంతో కాఫిఫోసా చట్టం కింద వారికి ఏడాది పాటు బెయిలు లభించదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా ప్రత్యేక కోర్టు నటికి బెయిల్ మంజూరుచేసినప్పటికీ.. కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com