AAP: ఆప్ విదేశీ నిధులు పొందినట్లుగా హోంశాఖకు ఈడీ ఫిర్యాదు

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై మరో ఉచ్చు బిగిస్తున్నది. ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ, పంజాబ్‌లలో అధికార పార్టీ ఆప్‌కు రూ.7 కోట్లకుపైగా విదేశీ నిధులు అందాయని ఈడీ ఆరోపించింది. ఈమేరకు కేంద్ర హోంశాఖకు సోమవారం లేఖ రాసింది. ఈ వ్యవహారంపై ఎఫ్‌సీఆర్‌ఏ, ప్రజా ప్రాతినిథ్యం చట్టం కింద విచారణ చేపట్టాలని ఈడీ కోరింది.
‘2015, 2016లలో అమెరికా, కెనడాలో నిధుల సేకరణ చేపట్టిన ఆప్‌కు రూ.7.08 కోట్లు విదేశీ నిధులు అందాయి. దీంట్లో విదేశీ దాతల గుర్తింపు, జాతీయతలను తారుమారు చేసింది. అలాగే ఇతర వివరాలు మార్చింది’ అని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కెనడాకు చెందిన కొంతమంది దాతల పేర్లను పార్టీ ఫైనాన్షియల్ రికార్డ్స్‌లో ఆప్ దాచిపెట్టిందని హోం శాఖకు ఈడీ తెలిపింది. ‘ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల్ని సాధారణంగా సీబీఐ విచారిస్తుంది. ఆప్‌ను ఉద్దేశించి ఈడీ చేసిన ఆరోపణలపైనా కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టవచ్చు’ అని ఈడీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
విదేశీ దాతల వివరాలతో పాటు విరాళాలకు సంబంధించిన అనేక వాస్తవాలను ఈప్ దాచిపెట్టిందని ఈడీ ఆరోపించింది. దాతల వివరాలను తప్పుగా ప్రకటించడం, తారుమారు చేయడం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించినట్లు పేర్కొంది. ఆప్, పార్టీ నేతలు విదేశీ నిధుల సేకరణలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తన దర్యాప్తుల్లో వెల్లడైందని ఈడీ వెల్లడించింది.
అంతేగాక 2016లో కెనాడాలో నిధుల సేకరణ కార్యక్రమంలో సేకరించిన నిధులను, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌తో సహా పలువురు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్నట్లు ఆరోపించింది. అనికేత్ సక్సేనా (ఆప్ ఓవర్సీస్ ఇండియా కోఆర్డినేటర్), కుమార్ విశ్వాస్ (ఒకప్పటి ఆప్ ఓవర్సీస్ ఇండియా కన్వీనర్), కపిల్ భరద్వాజ్ (అప్పటి ఆప్ సభ్యుడు), దుర్గేష్‌తో సహా వివిధ పార్టీ వాలంటీర్లు, కార్యనిర్వాహకుల మధ్య జరిగిన ఇ-మెయిల్‌లలోని విషయాల ద్వారా ఈ విషయాలు బయటపడినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈడీ ఆరోపణలను అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ తోసిపుచ్చింది. ఇది పార్టీ పరువు తీసేందుకు రాజకీయ కుట్ర అని నొక్కి చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com