MH POLITICS: మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు: సంజయ్‌ రౌత్‌

MH POLITICS: మహారాష్ట్ర సీఎం మారబోతున్నారు: సంజయ్‌ రౌత్‌
ఎన్సీపీ నేత సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు... మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిండేను మారుస్తారని వెల్లడి... శివసేన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని జోస్యం...

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్‌ శిండేను త్వరలో మారబోతున్నారని NCP నేత సంజయ్‌రౌత్‌ పునరుద్ఘాటించారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో... ఏక్‌నాథ్‌ శిండే పదవిని కోల్పోయే ప్రక్రియ మొదలైనట్టేనని స్పష్టం చేశారు. శిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై శాసనసభలో అనర్హత వేటు పడుతుందన్నారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా అజిత్‌ పవార్‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో చేరారని సంజయ్‌ రౌత్‌ తెలిపారు. తాను కెమెరా ముందు ఈ విషయాన్ని ప్రకటిస్తున్నానని.. ఇది జరిగి తీరుతుందని కూడా అన్నారు. ఇదంతా జరుగుతుందని తమకు ముందే తెలుసని రౌత్‌ తెలిపారు.


అజిత్‌ పవార్‌ తిరుగుబాటుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తిరుగుబాటును ప్రజలు సహించరని మండిపడ్డారు. ఎన్సీపీలో చీలిక గురించి శరద్‌ పవార్‌తో చర్చించానని తెలిపారు. కొందరు నేతలు మహారాష్ట్ర రాజకీయాలను శుభ్రం చేసే పనిని చేపట్టారని, వారు ఎంచుకున్న మార్గంలోనే వారిని ముందుకు వెళ్లనివ్వాలని

సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ప్రజల మద్దతు శరద్‌ పవార్‌కు ఉందని... ఉద్ధవ్‌ ఠాక్రేతో కలిసి మళ్లీ అన్నింటిని పునర్నిర్మిస్తానని సంజయ్ రౌత్‌ స్పష్టం చేశారు. పార్టీలను నిలువునా చీల్చే సర్కస్ ఫీట్లను మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం సహించరని అన్నారు మండిపడ్డారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లను బీజేపీ విడగొడుతోందని... దీని వల్ల వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదని సంజయ్‌ రౌత్‌ అన్నారు. మహారాష్ట్రలో ఐక్య పోరాటం చేస్తామని... ఎన్సీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఇటీవల ప్రధాని మోదీ విమర్శించారని.. ఇప్పుడు వారితో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారని రౌత్‌ ఎద్దేవా చేశారు.


శరద్‌ పవార్‌కు షాకిస్తూ ఆదివారం ఎన్సీపీ కీలక నేత అజిత్‌ పవార్‌ సహా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పా్ర్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ గూటికి చేరారు. అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు అజిత్‌ పవార్‌ వెంట ఉన్నారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పుడు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉండగా దేవేంద్ర ఫడ్నవీస్‌కు కేంద్రమంత్రి పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఎన్సీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి ప్రఫుల్‌ పటేల్‌కు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కనుందని ప్రచారం జరుగుతోంది.

Tags

Read MoreRead Less
Next Story