POLLS: సెవన్ సిస్టర్స్‌పైనే అందరి దృష్టి
సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టి ఈశాన్య రాష్ట్రాలపై నెలకొంది. సెవెన్ సిస్టర్స్‌గా భావించే ఏడు రాష్ట్రాలు సహా సిక్కింను కలుసుకుంటే మొత్తంగా 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అస్సాంలో బీజేపీ సత్తా చాటుతుండగా మిగిలిన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన బీజేపీ మరోసారి ఈశాన్యంలో పాగా వేయాలని చూస్తుండగా... పూర్వవైభవాన్ని సాధించాలని కాంగ్రెస్ కృత నిశ్చయంతో ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఆయా పార్టీల గెలుపు అవకాశాలపై ప్రత్యేక కథనం. ఇప్పుడిప్పుడే అభివృద్ధికి నోచుకుంటున్న ఈశాన్య రాష్ర్టాల్లో.. రాజకీయాలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ స్థానాలు తక్కువే అయినా దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సెవెన్ సిస్టర్స్ సున్నితమైన సరిహద్దు వివాదాలతో నిత్యం వార్తాలతో నిలుస్తుంటాయి.
అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మిజోరం, నాగాలాండ్, మణిపుర్‌తో పాటు సిక్కింలో రసవత్తర పోరు నెలకొంది. భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్, చైనాతో సుదీర్ఘ సరిహద్దును పంచుకుంటున్న ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అతిపెద్ద రాష్ట్రం అసోం. ఇక్కడ 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం, ఉమ్మడి పౌరస్మృతి, బాల్య వివాహాలు వంటి అంశాలు ఈసారి అసోం లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయనున్నాయి. అస్సాంలో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లగాను తొమ్మిది స్థానాలను గెలుచుకున్న బీజేపీ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని ఉత్సాహంతో ఉంది. మూడు స్థానాలకు పడిపోయిన కాంగ్రెస్ ఆ సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు దేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన CAA చట్టం ఇక్కడ బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉంది. అటు అస్సాంలో శాంతి వాతావరణం నెలకొల్పేందుకు సాయుధ వేర్పాటువాద సంస్థ ‘యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం- ఉల్ఫాతో దీర్ఘకాలంగా భాజపా జరిపిన చర్చలు ఫలించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక శాంతి ఒప్పందం జరగడం బీజేపీ విజయావకాశాలను పెంచింది. బాల్య వివాహాల అణచివేతపై సీఎం హిమంత బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆపార్టీకి మద్దతు పెరిగేలా చేశాయి. ఐతే బీజేపీ హిందుత్వ భావజాలంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టీ కార్మికుల కోసం భాజపా తెచ్చిన పథకాలు ఆ పార్టీపై ఓట్ల వర్షం కురిపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com