West Bengal: మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్లదాడి

ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ లో మరోసారి హింసాత్మక ఘటనలు జరిగాయి. మేదినీపూర్‌లో బీజేపీ నాయకుడు, నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తుండగా.. సీసాలు, రాళ్లు విసిరారు. ఈ ఘటనతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా.. బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్‌కు మద్దతుగా రోడ్‌షో చేసేందుకు మిథున్ అక్కడికి చేరుకున్నారు.
మిథున్ రోడ్ షో మేదినీపూర్‌లోని కెరానిటాలా ప్రాంతానికి చేరుకోగానే తృణమూల్ కార్యకర్తలు రోడ్డు పక్కన బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో రోడ్ షో చేస్తుండగా టీఎంసీ కార్యకర్తలు తమపైకి సీసాలు, రాళ్లతో దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. మిడ్నాపుర్ కలెక్టరేట్ దగ్గర రోడ్ షో ప్రారంభం అయ్యింది. వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్రలు వెళ్తున్న వాహనంపైకి కొందరు రాళ్లు, బాటిళ్లు విసిరారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడి చేయడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని వెంటనే అదుపులోకి తీసుకొచ్చారు.
మరోవైపు.. మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పంచషైర్‌లోని జాదవ్‌పూర్ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి సృజన్ భట్టాచార్య కారుపై రాళ్ల దాడి జరిగింది. అంతేకాకుండా.. ప్రచారం నిర్వహించే సమయంలో వారి పోస్టర్లు, ఫ్లెక్సీలు చింపేశారు. ఇదిలా ఉంటే.. తూర్పు మేదినీపూర్‌లోని భగవాన్‌పూర్‌లో సోమవారం రాత్రి టీఎంసి, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాగా.. ఈ ఘటనపై బీజేపీ నేతలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే.. ఈ ఘటనలో పోలీసులు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు.
సోమవారం ఖర్దాలోని నగరానికి ఆనుకుని ఉన్న డమ్‌డమ్ లోక్‌సభ స్థానం నుండి సీపీఐ(ఎం) అభ్యర్థి, సీనియర్ నాయకుడు సుజన్ చక్రవర్తి ప్రచారంలో అడ్డంకులు సృష్టించారు. ఈ ఘటనపై సీపీఎం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు ఘటనల్లోనూ టీఎంసీ కార్యకర్తలపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల్లో పార్టీ కార్యకర్తల ప్రమేయాన్ని అధికార పార్టీ కొట్టిపారేసింది. ఇది స్థానిక ప్రజల నిరసన అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com