Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ లింక్..

త్వరలోనే ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధించనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలోనే ఓటర్ ఐడీ, ఆధార్ అనుసంధానంపై చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఈసీలు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషీ న్యూఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈవో, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 నిబంధనల ప్రకారం.. ఓటర్ ఐడీకార్డును ఆధార్‌తో అనుసంధానంపై చర్చించారు.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులు త్వరలో ఈ విషయంలో మరింత చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇటీవల నకిలీ ఓటర్ కార్డ్ విషయంలో పార్లమెంట్‌తో పాటు బయట గందరగోళం నెలకొన్నది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తాయి. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల ఎన్నికల సంఘం దశాబ్దాల నాటి డూప్లికేట్ ఓటరు ఐడీ నెంబర్స్ సమస్యను రాబోయే మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓటర్ ఐడీతో ఆధార్ అనుసంధానంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com