Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..

దేశంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలను భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్‌తో గడువు ముగియనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 56 స్థానాలకు సంబంధించి ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 27 వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్‌లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 6 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి.
ఏప్రిల్ నెలతో రాజ్యసభలో 56 స్థానాలు ఖాళీ అవనున్నాయి. వీటికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27 వ తేదీన 56 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 8 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుండగా.. ఫిబ్రవరి 15 వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ అని ఈసీ వెల్లడించింది. ఫిబ్రవరి 16 వ తేదీన నామినేషన్ల పరిశీలన జరగనుండగా.. నామపత్రాల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 వ తేదీని చివరి తేదీ అని పేర్కొంది.
చివరికి ఫిబ్రవరి 27 వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఓటింగ్ పూర్తైన తర్వాత అదే రోజు లెక్కింపు చేపట్టి ఫలితాలు వెలువరించనున్నారు. ఇక ఈ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎక్కువ స్థానాలు ఉన్న రాష్ట్రంగా 10 స్థానాలతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. బిహార్‌లో 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్‌లో 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఒడిశా 3, రాజస్థాన్ 3, తెలంగాణ 3, ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. హర్యాణా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలు కాళీ అవుతుండగా ..ఆంధ్రప్రదేశ్ లో మూడు, తెలంగాణలో మూడు సీట్లు భర్తి కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com