Electoral Bonds : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను మళ్లీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఈసీ..

Electoral Bonds : ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను మళ్లీ వెబ్‌సైట్‌లో పెట్టిన ఈసీ..
అప్డేట్ చేసామంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో పెట్టిన ఈసీ

రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-SBI ఇచ్చిన కొత్త సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ఉంచింది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు పొందిన పార్టీల్లో 6 వేల 986 కోట్ల 50 లక్షలతో భాజపా అగ్రస్థానంలో నిలిచింది. 13 వందల97 కోట్లతో రెండో స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉంది. ఈసీ డేటా ప్రకారం ఫ్యూచర్ గేమింగ్ సంస్థ యజమాని శాంటియాగో మార్టిన్ రాజకీయ పార్టీలకు అత్యధిక విరాళాలు ఇచ్చిన దాతగా ఉన్నారు.

రాజకీయ పార్టీల విరాళాలకు సంబంధించిSBI ఇచ్చిన తాజా సమాచారాన్నికేంద్ర ఎన్నికల సంఘం బహిర్గతపరిచింది. గతంలో సీల్డ్ కవరులో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. EC వివరాల ప్రకారం 2018లో ఎలక్టోరల్ బాండ్లు ప్రారంభమైనప్పటి నుంచి వాటి ద్వారా భాజపా అత్యధికంగా 6 వేల 986 కోట్ల 50 లక్షల రూపాయలు అందుకున్నట్టు తెలుస్తోంది. అందులో 2019-20లోనే 2 వేల555 కోట్లు కమలదళం అందుకున్నట్టు ఈసీ డేటా తెలిపింది. ఇక 13 వందల97 కోట్లతో తృణమూల్ కాంగ్రెస్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు 13 వందల34 కోట్ల 35 లక్షలు వచ్చాయి. 13 వందల 22 కోట్ల రూపాయలతో భారాస నాలుగో స్థానంలో నిలిచింది. 944 కోట్ల 50 లక్షలతో B.J.D తర్వాతి స్థానంలో ఉంది. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా తమిళనాడులో అధికార పక్షం D.M.K 656.50 కోట్లు అందుకుంది. ఇందులో ఆ పార్టీకి కేవలం ఫూచర్‌ గేమింగ్‌ సంస్థ నుంచే 509 కోట్లు అందాయి. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ మొత్తం 13 వందల 68 కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు చేయగా అందులో నుంచి 37 శాతం DMKకు విరాళాలుగా వెళ్లాయి.

ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వైకాపా 442 కోట్ల 80 లక్షలు అందుకోగా తెలుగుదేశం 181 కోట్ల 35 లక్షలు అందుకుంది. కర్ణాటకలోని జనతా దళ్ సెక్యూలర్‌కు ఎన్నికల బాండ్ల ద్వారా 89.75 కోట్లు వచ్చాయి. ఇందులో 50 కోట్లు కేవలం మేఘా ఇంజినీరింగ్‌ నుంచే వచ్చాయని ఈసీ తెలిపింది. అంతేకాకుండా మేఘా ఇంజినీరింగ్‌ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిన సంస్థల్లో రెండో స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. ఇదే సంస్థ DMKకు 105 కోట్ల రూపాయలు విలువైన ఎన్నికల బాండ్లను ఇచ్చింది..

దాతల వివరాలను వెల్లడించిన అతికొద్ది రాజకీయ పార్టీలలో DMK కూడా ఉంది. అయితే భాజపా, కాంగ్రెస్, TMC ,ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి ఈ వివరాలను వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం తాజాగా ఈ వివరాలు బహిర్గతమయ్యాయి.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులను స్వీకరించబోమని CPM ప్రకటించింది. AIMIM, బీఎస్పీకి సంబంధించి ఎలాంటి రశీదులు లేవు.

Tags

Read MoreRead Less
Next Story