ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల సైరన్..

ఐదు రాష్ట్రాలకు మోగనున్న ఎన్నికల సైరన్..
మరికొద్ది గంటల్లో ప్రకటించనున్న సీఈసీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈరోజు విడుదలవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రెస్ మీట్ లోనే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. ఇటీవలే ఐదు రాష్ట్రాల్లో ఈసీ పర్యటన పూర్తయింది. ఈ పర్యటన అనంతరం ఢిల్లీలో సమీక్ష తర్వాత షెడ్యూల్ ప్రకటన ఉంటుందని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రంతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో జరిగే ప్రెస్ మీట్లో ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించనుంది. ప్రధాన ఎన్నికల కమీషనర్ తో పాటు ఎన్నికల కమిషన్ లోని కీలక అధికారులు హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.


2024లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు సెమీ పైనల్స్ గా పరిగణిస్తున్నారు. వీటిలో ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్ రాష్ట్రాలు ఉండగా.. దక్షిణ భారతదేశంలో తెలంగాణ, ఈశాన్య భారతంలో మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చే ఏడాది జరగబోయే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఇదిలాఉంటే.. తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలుండగా.. ఛత్తీస్ గడ్ లో మాత్రం రెండు విడుతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.


జమిలి కోసం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడతాయని అనుకున్నారు. జమిలి కమిటీ కూడా పనులు మొదలు పెట్టడంతో అందరిలో అదే అనుమానం మొదలైంది. కానీ ఈసారికి జమిలి వాయిదా పడినట్టే తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ రెడీ అయింది.

Tags

Read MoreRead Less
Next Story