EC Press Meet: నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం..

ఎన్నికల కమిషన్ టార్గెట్ గా.. దేశంలో అనేక చోట్ల ఓటర్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సహా విపక్ష నేతలు ఆరోపణలు చేశాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈసీ రెడీ అయినట్లు సమాచారం. ఈ ఓట్ల చోరీ ఆరోపణలపై నేడు ( ఆగస్టు 17న) మీడియా సమావేశం నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే, బీహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటు అధికార్ యాత్ర’ను ప్రారంభించబోతున్న రోజే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో తప్ప.. ఇతర అంశాలపై ఎన్నికల కమిషన్ అధికారికంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం చాలా అరుదు. ఇవాళ (ఆదివారం) నిర్వహించనున్న ప్రెస్ కాన్ఫరెన్స్ వెనుక అసలు కారణాన్ని తెలియజేయనప్పటికీ.. గత కొంతకాలంగా ఈసీపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా ఈ ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రతిపక్షాలు ‘ఓటు చోరీ’ అనే పదాన్ని పదే పదే ఉపయోగించడాన్ని ఎన్నికల సంఘం ఇప్పటికే ఖండించింది. తప్పుడు కథనాలను ప్రచారం చేసే బదులు ఆధారాలు ఇవ్వాలని కోరింది.
కాగా, బీహార్‌లో ఓట్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్), ఓట్ల చోరీపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానాల్లో ఓట్లు చోరీకి గురయ్యాయని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీకి గురయ్యాయని పేర్కొన్నాడు. ఈ ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్ ఇవ్వాలని ఈసీ కోరింది. లేకపోతే దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com