ED Notices to Byjus: అసలే కష్టాల్లో ఉన్న బైజూస్‌కు ఈడీ షాక్!

రూ.9 వేల కోట్లు చెల్లించమంటూ నోటీసులు

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్-ఈడీ నోటీసులు జారీ చేసింది. విదేశీ మారక నిర్వహణ చట్టం నిబంధనలు ఉల్లంఘించి బైజూస్.. తొమ్మిది వేల కోట్లను విదేశాలకు తరలించినట్లు ఈడీ తెలిపింది. 2011 నుంచి 2023 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో బైజూస్‌ 28 వేల కోట్లు అందుకున్నట్లు వెల్లడించింది. ఇదే కాలంలో విదేశీ పెట్టుబడుల రూపంలో ఇతర దేశాలకు తొమ్మిది వేల 754 కోట్లను తరలించినట్లు పేర్కొంది. ఈ వార్తలను బైజూస్ ఖండించింది. మీడియా కథనాలను తోసిపుచ్చుతున్నట్లు ఆ సంస్థ అధికార ప్రతినిధి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపై ఈడీ నుంచి తమకు ఎలాంటి సమాచారం రాలేదని తెలిపారు.

దేశంలో అతిపెద్ద ఎడ్‌టెక్ స్టార్టప్ కంపెనీగా కొనసాగుతున్న బైజూస్ సంస్థ ఒకదాని తర్వాత మరొక వివాదంలో ఇరుక్కుంటోంది. కంపెనీని వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. తాజాగా కంపెనీ రూ.9,000 కోట్ల మేర ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ చట్టాలను ఉల్లంఘించిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి షోకాజ్ నోటీసులను అందుకుంది. ఈ ఆరోపిస్తూ ఎడ్టెక్ మేజర్ బైజూస్‌ మరోసారి వార్తల్లో నిలిచింది.బైజూస్, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు బైజూ రవీందరన్‌పై షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.


ఈ ఏడాది ఏప్రిల్‌లో ఫెమా నిబంధనల ప్రకారం రవీందరన్, అతని కంపెనీ 'థింక్ & లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్'పై నమోదైన కేసుకు సంబంధించి కర్ణాటకలోని బెంగళూరులోని మూడు ప్రాంగణాల్లో ED సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలను, డిజిటల్ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2011 నుంచి 2023 వరకు కంపెనీ దాదాపు రూ. 28,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందింది. ఇదే కాలంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.9,754 కోట్లను వివిధ విదేశీ అధికార పరిధికి పంపించిందని ED అధికారులు తెలిపారు. ప్రకటనలు, మార్కెటింగ్ ఖర్చుల పేరుతో దాదాపు రూ.944 కోట్లను కంపెనీ ఖర్చుచేసినట్లు చూపినట్లు ఈడీ గుర్తించింది. అసలే నగదు కొరతతో ఇబ్బందులు పడుతున్న కంపెనీ వరుస సంక్షోభాలను ఎదుర్కొంటోంది. జూన్‌లో $1.2 బిలియన్ల టర్మ్ లోన్ చెల్లింపును మిస్ చేసింది. కంపెనీ చట్టబద్దమైన ఆడిట్ రిపోర్టులు సకాలంలో విడుదల చేయకపోవటంతో బోర్డు సభ్యులు సైతం కంపెనీని వీడారు. ఈ క్రమంలోనే కంపెనీ అనేక పర్యాయాలుగా చాలా వేల మంది ఉద్యోగులను తొలగించింది. కనీసం ఆఫీసు అద్దె కట్టేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నవంబరులో మణిపాల్ గ్రూప్ ఛైర్మన్ రంజన్ పాయ్ US హెడ్జ్ ఫండ్ రుణ పెట్టుబడిని రూ.1,400 కోట్ల ఒప్పందంలో కొనుగోలు చేయటం కంపెనీకి ఇటీవల పెద్ద ఊరటను అందించింది. ప్రస్తుతం కంపెనీ నష్టాలను తగ్గించుకుని లాభాల్లోకి వచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story