Rajya Sabha :మరోసారి జయాబచ్చన్ వర్సెస్ చైర్మన్
మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు, సీనియర్ నటి జయాబచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది. నేరుగా చైర్మన్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రతిగా చైర్మన్ స్పందించడం, తిరిగి జయ మాట్లాడటం.. ఇలా పెద్దల సభలో తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం రాజుకుంది. చైర్ తనకు క్షమాపణలు చెప్పాలని జయ గట్టిగా డిమాండ్ చేశారు. జయాబచ్చన్‌కు మద్దతుగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ నేతృత్వంలో రాజ్యసభలోని విపక్ష పార్టీల సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. గత సోమవారం రాజ్యసభలో చైర్మన్ తనను ‘జయా అమితాబ్ బచ్చన్’ అంటూ సంబోధించడాన్ని ఆమె అభ్యంతరపెట్టారు.
రాజ్యసభలో శుక్రవారం చైర్మన్ జగదీప్ ధన్‌కర్, ఎంపీ జయాబచ్చన్ మధ్య పేరు విషయంలో మరోసారి వాగ్వాదం చోటుచేసుకొన్నది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేపై బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్, విపక్ష సభ్యుల మధ్య చర్చ జరుగుతున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ మాట్లాడేందుకు అవకాశం కోరారు. దీనికి చైర్మన్ ధన్‌కర్ అనుమతిస్తూ ‘జయా అమితాబ్ బచ్చన్ మీ పాయింట్ ఏంటో చెప్పండి’ అని అన్నారు. తనను జయా అమితాబ్ బచ్చన్ అని సంబోధించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను జయా అమితాబ్ బచ్చన్‌ను ఒకటి చెప్పాలని అనుకొంటున్నా.. మీ గొంతు టోన్ ఆమోదనీయంగా లేదు. నేను ఒక ఆర్టిస్టును. బాడీ లాంగ్వేజ్, వ్యక్తీకరణలను నేను అర్థం చేసుకోగలను’ అంటూ మాట్లాడుతుండగా జోక్యం చేసుకొన్న చైర్మన్ ధన్‌కర్ ‘ఇక చాలు’ అని అన్నారు. ‘ మీరు సెలబ్రిటీ కావొచ్చు లేదా మరెవరైనా కావొచ్చు. మీరు మంచి ప్రవర్తనను పాటించాల్సిందే’ అని పేర్కొన్నారు. జయాబచ్చన్ ఒక సీనియర్ ఎంపీ అని, చైర్మన్ ఆమెను ఒక సెలబ్రిటీ అని ఎలా పిలుస్తారని విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ధన్‌కర్, జయాబచ్చన్ మధ్య వాగ్వాదం తర్వాత ప్రతిపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత 10 రోజుల వ్యవధిలో ఆమె పేరు విషయంలో వాగ్వాదం జరగడం ఇది మూడోసారి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. లోక్‌సభ, రాజ్యసభలను స్పీకర్, చైర్మన్‌ను నిరవధిక వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 12 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగాల్సి ఉండగా, మూడు రోజుల ముందుగానే నిరవధికంగా వాయిదా పడటం గమనార్హం. ఈ సమావేశాల్లో వక్ఫ్ చట్టం-1995ను సవరిస్తూ కేంద్రం ఓ బిల్లును ప్రవేశపెట్టడంపై వివాదం రేగిన విషయం తెలిసిందే.
ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధన్‌కర్‌ను తొలగించేలా అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండియా కూటమి పార్టీలు యోచిస్తున్నాయి. ఇందుకు సంబంధించి నోటీసు సమర్పించే సమయంపై పార్టీలు చర్చించనున్నాయని, తీర్మానం ఆమోదం పొందకపోయినప్పటికీ, సభలో చైర్మన్ ధనకర్ పక్షపాత తీరును హైలెట్ చేసినట్టు అవుతుందని భావిస్తున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. విపక్ష నేతల మైక్‌ను పదేపదే కట్ చేస్తున్నారని, రూల్స్‌కు అనుగుణంగా సభ నడవడం లేదని విపక్ష పార్టీలు అంటున్నాయి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com