Indians in Iran: ఇరాన్‌లో భారతీయులను తరలించేందుకు రంగం సిద్ధం!

Indians in Iran: ఇరాన్‌లో  భారతీయులను తరలించేందుకు రంగం సిద్ధం!
X
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని కేంద్రం హెచ్చరిక

ఇరాన్‌ లో పరిస్థితులు క్షీణించడంతో పాటు ఆ దేశంపై అమెరికా సైనిక చర్యలకు దిగే అవకాశమున్న నేపథ్యంలో భారత్‌ మరింత అప్రమత్తమైంది. అందుబాటులో ఉన్న మార్గాల్లో దేశాన్ని వీడాలని భారతీయులకు సూచించిన విదేశాంగ శాఖ . స్వదేశానికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న వారిని సురక్షితంగా తీసుకురావడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి ఈ తరలింపు ప్రక్రియను ప్రారంభించే అవకాశాలున్నట్లు విదేశాంగ శాఖ వర్గాల సమాచారం.

ఇరాన్‌లో ప్రస్తుతం 10 వేలమందికిపైగా భారతీయులు (విద్యార్థులు సహా) నివసిస్తున్నట్లు అంచనా. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరిని సంప్రదించేందుకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడం, మరికొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు పనిచేస్తుండడం ఇందుకు ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వారిని చేరుకునేందుకు ఎంబసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. గతేడాది ఇజ్రాయెల్-ఇరాన్‌ యుద్ధం సమయంలోనూ ‘ఆపరేషన్‌ సింధు’ చేపట్టి.. అనేక మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇరాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ.. వాణిజ్య విమానాల రాకపోకలకు గగనతలాన్ని అక్కడి ప్రభుత్వం మూసివేసింది. ఈ చర్యలతో కొన్ని అంతర్జాతీయ సర్వీసులు ప్రభావితమైనట్లు ఎయిరిండియా, ఇండిగో సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపాయి. అయితే, గగనతలం మూసివేత ప్రకటనకు కొన్ని నిమిషాల ముందే ఓ ఇండిగో విమానం టెహ్రాన్‌ నుంచి భారత్‌కు బయలుదేరినట్లు సమాచారం.

Tags

Next Story