ED Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై ఈడీ దాడులు

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేశ్ బఘేల్ నివాసంపై సోమవారం ఈడీ దాడులు చేస్తోంది. భిలాయ్‌లోని భూపేశ్ బఘేల్, ఆయన కుమారుడు చైతన్య నివాసంపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 14 చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ కేసును కోర్టు కొట్టేసిందని భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు. కేవలంలో కుట్రలో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపించారు.
ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి. మద్యం సిండికేట్‌కు రూ.రెండువేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని ఈడీ గతంలో పేర్కొంది. దర్యాప్తులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు వ్యాపారవేత్తలను అరెస్టు చేసింది. తాజాగా మరోసారి ఈడీ దాడులు నిర్వహించడంపై కాంగ్రెస్ శ్రేణులు తప్పుపడుతున్నారు. కుట్రలో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
సోదాల్లో భాగంగా అనేకమైన కీలక పత్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుల ఇళ్లల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్ ద్వారా.. భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య భారీగా లబ్ధి పొందినట్లుగా అధికారులు భావిస్తున్నారు. కమీషన్ల ద్వారా పెద్ద మొత్తంలోనే డబ్బు ముట్టినట్లుగా అంచనా వేస్తున్నారు. దాదాపు రూ.2,161 కోట్లు స్వాహా చేశారని అధికారులు చెబుతున్నారు.
అయితే ఏడేళ్ల క్రితం కొట్టేసిన కేసుపై మళ్లీ దర్యాప్తు ఏంటి? అని భూపేశ్ బఘేల్ ప్రశ్నిస్తున్నారు. తప్పుడు కేసును న్యాయస్థానం కొట్టేసిన తర్వాత కూడా దాడులు చేస్తున్నారంటే… ఇందులో ఏదో కుట్ర కోణం దాగి ఉందని ఆయన ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com