Samosa party: హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం..

Samosa party: హిమాచల్‌ప్రదేశ్‌ను వదలని సమోసా వివాదం..
X
హిమాచల్‌ సీఎంను ఎగతాళి చేసేందుకు.. మాజీ సీఎం సమోసా పార్టీ

హిమాచల్‌ప్రదేశ్‌ రాజకీయాలను సమోసాల వివాదం ఇంకా కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల-తూటాలు పేలుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకి బీజేపీ ఎమ్మెల్యే 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది

గత నెల (అక్టోబర్) 21న ముఖ్యమంత్రి సుఖు.. సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ఓ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే హోటల్ నుంచి సమోసాలు రాగానే.. వాటిని పోలీసులకు అందజేశారు. అయితే పొరపాటున తమ కొరకే సమోసాలు తెచ్చారేమోనని పోలీస్ సిబ్బంది ఆరగించారు. అయితే వేదికపైకి సమోసాలు రాకపోవడంతో ప్రముఖులు ఆకలితో ఇబ్బందిపడ్డారు. ముఖ్యమంత్రితో సహా ప్రముఖులకు ఈ ఇబ్బంది తలెత్తింది. అయితే సమోసాలు.. లోపలికి వెళ్లకుండా బయటనే సిబ్బంది తినేశారు. అయితే సమోసాలు ఎలా మిస్ అయ్యాయంటూ సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించింది. సమోసాల కోసం సీఐడీ విచారణకు ఆదేశించడమా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అయితే ఈ ఆరోపణలను ముఖ్యమంత్రి ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.

తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్‌ శర్మ.. ముఖ్యమంత్రి సుఖుకు 11 సమోసాలను ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ.. ‘‘నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే.. సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించించడం తీవ్రంగా నిరాశపరిచింది. ఈ తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రికి 11 సమోసాలు పంపాను. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తుచేసేందుకే అలా చేశాను’’ అని శర్మ వెల్లడించారు. మరోవైపు శుక్రవారం రాత్రి బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్.. బీజేపీ శ్రేణులకు సమోసా పార్టీ ఇచ్చి ప్రభుత్వ తీరును ఎద్దేవా చేశారు.

గతంలోనూ ఆ రాష్ట్రంలో ‘టాయిలెట్ సీట్ ట్యాక్స్’ వివాదాస్పదమైంది. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో టాయిలెట్ సీట్‌కు రూ.25 చొప్పున పన్ను వసూలుచేయాలని, ఒక ఇంటిలో ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటిపైనా పన్ను చెల్లించాల్సిందేనంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది రాజకీయ విమర్శలకు దారితీసింది. సిగ్గుచేటు చర్య అని భాజపా విమర్శలు గుప్పించింది. ‘‘టాయిలెట్ సీట్ల ఆధారంగా పన్నులు విధిస్తామని, ఆ సీట్ల సంఖ్య ఆధారంగా మురుగునీటి కనెక్షన్లు ఇస్తామనే వార్తల్లో వాస్తవం లేదు’’ అని ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Tags

Next Story