Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎంకి బెయిల్..

Hemant Soren: ల్యాండ్ స్కామ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎంకి బెయిల్..
X
జనవరిలో హేమంత్ సొరెన్‌ని అరెస్ట్ చేసిన ఈడీ..

ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్‌కి బెయిల్ లభించింది. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూ కుంభకోణం కేసులో జనవరి నెలలో ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అక్రమ లావాదేవీలు, నకిలీ పత్రాల ద్వారా రికార్డులను తారుమారు చేసి, కోట్ల రూపాయల విలువైన భూమిని సంపాదించడానికి కుట్ర పన్నాడనే ఆరోపణలు ఉన్నాయి. జనవరి 31న సోరెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. రాంచీలో 8.86 ఎకరాల భూమిని అక్రమంగా సంపాదించారని సోరెన్‌పై అభియోగాలు ఉన్నాయి.

ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులు తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించి.. అక్రమ ఆదాయాన్ని పొందారని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం సోరెన్‌ పలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఎన్నికల వేళ ప్రచార నిమిత్తం బెయిల్‌ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరినప్పటికీ ఉపశమనం లభించలేదు. చివరకు నేడు ఆయనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోరెన్, ఐఏఎస్ అధికారి, రాంచీ మాజీ డిప్యూటీ కమిషనర్ ఛవీ రంజన్, భాను ప్రతాప్ ప్రసాద్ తదితరులతో సహా 25 మందికి పైగా వ్యక్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.. తనపై వచ్చిన ఆరోపణల్ని సోరెన్ ఖండించారు. ప్రతీకారంతోనే బీజేపీ తమనపై దాడులు చేయిస్తుందని ఆరోపించారు.

Tags

Next Story