Draupadi murmu: రాష్ట్రపతి సొంతూరుకు తొలి ఎక్స్‌ప్రెస్ రైలు

ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలోని బాదంపహార్ రైల్వే స్టేషన్ నుంచి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రైళ్లను ప్రారంభించారు.బాదంపహార్-షాలిమార్, బాదంపహార్-రూర్కెలా వరకు రెండు వారాంతపు ఎక్స్‌ప్రెస్‌లు, బాదంపహార్ - టాటానగర్ మధ్య ఒక MEMU రైళ్లను రాష్ర్టపతి జెండా ఊపి ప్రారంభించారు.ముర్ము స్వస్థలమైన.. ఉపర్బెడాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయ్‌రంగ్‌పుర్‌లో బాదంపహార్ - టాటానగర్ మెము రైలు ఆగనుంది. దీంతో 112 ఏళ్లలో తొలిసారి రాయ్‌రంగ్‌పుర్‌కు... ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా బాదంపహార్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ముర్ము శంకుస్థాపన చేశారు.ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్,కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు పాల్గొన్నారు. దేశంలోని గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించడమే మోదీ ప్రభుత్వ ప్రాధాన్యమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
స్థానిక ఆర్థిక వ్యవస్థకు, ఆరోగ్య సంరక్షణ, గిరిజన పర్యాటకానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని ఇస్తాయని వెల్లడించారు. ఈ సేవలన్నీ ప్రజల జీవితాలను మరింత సులభతరం చేస్తాయన్నారు . మంగళవారం ప్రారంభించిన ఈ మూడు రైళ్లు జార్ఖండ్ , పశ్చిమ బెంగాల్ వంటి పొరుగు రాష్ట్రాలకు ప్రయాణించడానికి స్థానికులకు ఎంతో సహాయపడతాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఒడిశాలోని పారిశ్రామిక పట్టణం రూర్కెలాను సందర్శించడంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగదని ఆమె తెలిపారు. సెల్ ఫోన్లు , కొరియర్ సేవల ట్రెండ్ పెరుగుతున్నప్పటికీ ఇండియా పోస్ట్ తన ఔచిత్యాన్ని కోల్పోలేదని రాష్ట్రపతి అన్నారు. రాయంగ్పూర్ లో కొత్త పోస్టల్ డివిజన్ ప్రారంభోత్సవం ఈ ప్రాంతానికి ఒక ముఖ్యమైన కార్యక్రమని , ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడు తపాలా సేవలను సులభంగా పొందగలుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. గిరిజనుల అభివృద్ధి లేకుండా సమ్మిళిత అభివృద్ధి అసంపూర్ణమని అన్నారు. అందుకే గిరిజన సంఘాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందన్నారు .
గిరిజన యువత ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్వీయ అభివృద్ధి కి సొంత ప్రయత్నం కూడా అవసరమని ఉద్ఘాటించారు. యువత తమ జీవితంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి రాష్ట్రపతి అన్నారు . పివిటిజిల అభివృద్ధికి ప్రభుత్వం ఈ ఏడాది జనజాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా పిఎం జన్మన్‌ను ప్రారంభించిందని రాష్ట్రపతి తెలిపారు. గిరిజనుల ప్రగతికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆమె పేర్కొన్నారు. ఈ అమృత్కాల్ కార్యక్రమం ప్రజలను అభివృద్ధితో అనుసంధానం చేస్తుందని అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి ముర్ము బాదంపహార్ – షాలిమార్ ఎక్స్‌ప్రెస్ రైలులో బదంపహార్ నుండి రాయిరంగపు వరకు ప్రయాణించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com