Modi Cabinet : క్యాబినెట్‌పై బయటపడుతున్న అసంతృప్తి సెగలు

Modi Cabinet :  క్యాబినెట్‌పై బయటపడుతున్న  అసంతృప్తి సెగలు
సహాయ మంత్రి కేటాయింపుపై శివసేన పెదవి విరుపు

కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన క్యాబినెట్‌ కూర్పుపై అసంతృప్తి సెగలు రేగుతున్నాయి. భాగస్వామ్య పక్షాలకు మంత్రి పదవులు కేటాయింపుపై శివసేన(షిండే వర్గం) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తమ కంటే తక్కువ ఎంపీ సీట్లు గెలుచుకొన్న ఇతర ఎన్డీయే పక్ష పార్టీలకు క్యాబినెట్‌ హోదా కలిగిన మంత్రి పదవులు కేటాయించి.. మహారాష్ట్రలో ఏడు లోక్‌సభ స్థానాలు గెలుచుకొన్న తమకు మాత్రం సహాయ మంత్రి పదవి ఇవ్వడంపై పెదవి విరిచింది. పదవుల కేటాయింపులో బీజేపీ పక్షపాతం చూపిందని శివసేన(షిండే) ఎంపీ శ్రీరంగ్‌ బర్నే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం క్యాబినెట్‌ హోదా మంత్రి పదవి దక్కుతుందని ఆశించామని అన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలుచుకొన్న అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా మంత్రి పదవి కేటాయింపుపై వేచి చూసే ధోరణిలో ఉన్నట్టు కనిపిస్తున్నది.

ఐదు సీట్లు గెలిచిన చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీకి, రెండు సీట్లు గెలుచుకొన్న జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి, ఒక్క సీటు మాత్రమే గెలిచిన జితిన్‌ రాం మాంఝీకి క్యాబినెట్‌ పదవులు ఇచ్చారని శ్రీరంగ్‌ బర్నే ఈ సందర్భంగా పోలిక తెచ్చారు. ఎన్డీయే కూటమిలో జేడీయూ, టీడీపీ తర్వాత తమ పార్టీనే పెద్ద భాగస్వామి అని అన్నారు. మహారాష్ట్రలో 15 సీట్లలో పోటీచేసిన తాము ఏడు సీట్లలో విజయం సాధించామని, 28 స్థానాల్లో నిలిచిన బీజేపీ కేవలం తొమ్మిదింటిలో మాత్రమే గెలిచిందని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపారు. బీజేపీ పాత మిత్రుడిగా ఉన్న శివసేనకు కేంద్ర మంత్రివర్గంలో ఒక క్యాబినెట్‌ హోదా మంత్రి, ఒక సహాయ మంత్రి పదవిని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను కలిసి ఎదుర్కోనున్న నేపథ్యంలో శివసేనకు తగిన గౌరవం దక్కుతుందని భావిస్తున్నామన్నారు. షిండే తీసుకొన్న నిర్ణయం వల్లే రాష్ట్రంలో అధికార మార్పు జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని బీజేపీ నుంచి తగిన వైఖరిని తాము ఆశిస్తున్నామని ఎంపీ శ్రీరంగ్‌ చెప్పారు.

Tags

Next Story