Fake SBI branch: ఎస్‌బీఐ నకిలీ బ్రాంచును ఏర్పాటుచేసి ..ఈ కేటు గాళ్ళ రూటే సేపరేటు

Fake SBI branch:  ఎస్‌బీఐ నకిలీ బ్రాంచును ఏర్పాటుచేసి ..ఈ కేటు గాళ్ళ రూటే సేపరేటు
X
ప్రజలకు లక్షల్లో టోకరా

ఛత్తీస్‌గఢ్‌లో విస్తుపోయే బ్యాంకింగ్‌ మోసం వెలుగులోకి వచ్చింది. నేరగాళ్లు ఏకంగా ఓ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటుచేసి, ప్రజలను నిండా ముంచారు. నకిలీ నియామకాలు, శిక్షణ కార్యక్రమాలతో నిరుద్యోగ యువతను సైతం మోసం చేశారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 250 కి.మీ దూరంలోని సక్తి జిల్లా ఛపోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

అద్దె భవనంలో ఏర్పాటు చేసిన ఈ ‘ ఫేక్ బ్యాంక్’ సెప్టెంబర్ 18 నుండి పని చేస్తుందని స్థానికులు తెలిపారు. దాని ముందు SBI బ్యానర్ ఉంది. అంతేకాదు కొత్త ఫర్నిచర్, ప్రొఫెషనల్ పేపర్లు, ఫంక్షనింగ్ కౌంటర్లతో సహా నిజమైన బ్యాంక్ లాగా అన్ని హంగులను ఏర్పాటు చేశారు మాయగాళ్లు. అచ్చం ఒరిజినల్ స్టేట్ బ్యాంక్ లాగా లావాదేవీలు చేపట్టారు.

అయితే అవగాహన లేని గ్రామస్థులు ‘బ్యాంక్‌లో ఖాతాలు తెరవడం ప్రారంభించారు. ఆర్థిక లావాదేవీలు మొదలుపెట్టారు. ఇక్కడ కొత్తగా ఉద్యోగులు కార్యకలాపాలను పట్టించుకోలేదు. సమీపంలోని డాబ్రా బ్రాంచ్ మేనేజర్ SBIతో దాని చట్టబద్ధతపై అనుమానాలు లేవనెత్తే వరకు అంతా బాగానే ఉంది. ఫిర్యాదును స్వీకరించిన తర్వాత, SBI అధికారులతో పాటు పోలీసు బృందం సెప్టెంబర్ 27న బ్యాంక్‌లో విచారణ చేపట్టడంతో ఛపోరాలోని ఫేక్ బ్రాంచ్ మోసం బయటపడింది.


మాయగాళ్లు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ పేరుతో స్థానికుల నుండి డబ్బును కూడా తీసుకొన్నారు వారి నుండి రూ. 2 లక్షలు నుంచి రూ. 6 లక్షల రూపాయల వరకు తీసుకున్నారు. ఆ తర్వాత వారికి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లను కూడా అందజేశారు. చివరికి పోలీసులు దాడి చేసి కంప్యూటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కోర్బాలోని SBI ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసుల బృందం తనిఖీ నిర్వహించి, బ్రాంచ్ నకిలీదని నిర్ధారించినట్లు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమా పటేల్‌ తెలిపారు.

భారతీయ న్యాయ సంహిత (BNS) కింద ముగ్గురు ఆపరేటర్లపై, బ్రాంచ్ మేనేజర్‌గా వ్యవహరించిన సూత్రధారితో సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ పథకం ద్వారా ఎంత మందిని మోసం చేశారు. ఎంత డబ్బు వసూలు చేశారనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ సంఘటన తమిళనాడులో 2020లో జరిగిన సంఘటన తిరిగి గుర్తుకు తెస్తుంది. ఇక్కడ కడలూరు జిల్లాలోని పన్రుటిలో నకిలీ SBI శాఖను నడుపుతున్నందుకు ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్‌బీఐ మాజీ ఉద్యోగి కుమారుడు కంప్యూటర్లు, లాకర్లు, నకిలీ పత్రాలతో మోసపూరిత శాఖను ఏర్పాటు చేశాడు. పట్టణంలో ఇప్పటికే ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌ మేనేజర్‌ని ఓ కస్టమర్‌ ఆరా తీయడంతో అది బయటపడింది.

Tags

Next Story