Al-Falah University: అల్‌-ఫలాహ్ అక్రమాలపై సిట్ ఏర్పాటు

Al-Falah University:  అల్‌-ఫలాహ్ అక్రమాలపై సిట్ ఏర్పాటు
X
హర్యానా పోలీస్ శాఖ కీలక నిర్ణయం..

ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఫరీదాబాద్‌లోని అల్‌-ఫలాహ్ విశ్వవిద్యాలయం కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర బయటపడింది. ఉగ్ర డాక్టర్ల బృందం ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కలిసి దేశ వ్యాప్తంగా భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. టెర్రర్ మాడ్యూల్ బయటపడడంతో అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత కుట్ర జరిగిందో వెలుగు చూసింది. ఇక మంగళవారం హర్యానా డీజీపీ ఓపీ సింగ్, కమిషనర్, డిప్యూటీ కమిషన్ ఆఫ్ పోలీస్ బృందం మంగళవారం క్యాంపస్‌ను సందర్శించారు. దీంతో యూనివర్సిటీలో చాలా లోపాలు కనిపించాయి. క్యాంపస్‌లో ఉగ్ర కుట్రలు జరుగుతున్నా.. ఎందుకు గుర్తించలేకపోయారని.. ఇందులో ఏదో మతలబు ఉందంటూ పోలీస్ అధికారుల బృందం భావించింది. ఇప్పటికే సంస్థ ఛైర్మన్‌ను అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల రాకతో చాలా మంది ప్రొఫెసర్లు, స్థానికులు కూడా అదృశ్యమయ్యారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ అక్రమాలపై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.

ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్లు ఆఫ్ పోలీస్, ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేశారు. విశ్వవిద్యాలయం కార్యకలాపాలపై దర్యాప్తు చేసి.. సమగ్ర నివేదికను అందించాలని ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా.. సిట్‌కు ఆదేశించారు.

ఇక రంగంలోకి దిగిన సిట్ బృందం.. ఒక క్యాబ్ డ్రైవర్, ఒక మతాధికారి, ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక క్యాబ్ డ్రైవర్‌ది పాల్వాల్ జిల్లాలోని అసౌటి గ్రామ వాసి. ఇతడు ధౌజ్ గ్రామంలోని బిల్లా కాలనీలో ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు. అయితే ఇంట్లో చిన్న పిల్లాడిపై వేడి పాలు పడడంతో గాయాలు అయ్యాయి. దీంతో చికిత్స కోసం కొడుకును అల్-ఫలాహ్ యూనివర్సిటీలోని ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అక్కడ డాక్టర్ ముజిమ్మల్‌ను కలిశాడు. దీంతో ముజిమ్మల్‌తో క్యాబ్‌డ్రైవర్‌కు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే డాక్టర్ ముజమ్మిల్‌కు, కొంత మంది విద్యార్థులకు, ఇతర సహచరులకు సిమ్ కార్డులను అందించినట్లుగా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ ఇంటి నుంచి ఒక గ్రైండింగ్ మెషిన్, మరొక విద్యుత్ పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఉగ్రవాదుల టెర్రర్ మాడ్యూల్‌లో క్యాబ్ డ్రైవర్ కూడా ఒక పాత్రదారుడిగా ఉన్నట్లుగా అధికారులు భావిస్తున్నారు.

అలాగే ఒక మతాధికారి, ఒక ఉర్దూ ఉపాధ్యాయుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిది నుహ్ జిల్లాలోని ఘసేరా గ్రామస్తులు. సోహ్నా సమీపంలోని రాయ్‌పూర్ గ్రామంలోని షాహి జామా మసీదు నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి. డాక్టర్ ఉమర్.. తరుచుగా మసీదు ప్రార్థనలకు ఈ ప్రాంతానికే వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే మసీదుకు వచ్చిన క్రమంలో డాక్టర్ ఉమర్.. వీరిద్దరితో ఏమైనా సంభాషణ జరిగించాడా? అనే కోణంలో విచారిస్తున్నారు.

అయితే ఈ ఉగ్ర కుట్రలో ఎలాంటి సంబంధం లేదంటూ మతాధికారి కుటుంబ సభ్యులు వాపోయారు. షాహి జామా మసీదు హైవేపై పక్కన ఉంది కాబట్టి.. దేశంలో ఎక్కడి నుంచైనా ముస్లింలు వెళ్తుంటే అక్కడికి వస్తారని.. అదే క్రమంలో డాక్టర్ ఉమర్ కూడా వచ్చి ఉండొచ్చని కుటుంబ సభ్యులు వాపోయారు. అంతే తప్ప డాక్టర్‌తో ఉమర్‌తో ఎలాంటి సంబంధాలు లేవని మతాధికారి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం యూనివర్సిటీ సభ్యత్వం రద్దైంది. దీంతో విద్యార్థుల భవిష్యత్ అంధకారం అయింది. ఈ నేపథ్యంలో శనివారం పెద్ద ఎత్తున యూనివర్సిటీ దగ్గర ఆందోళనలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ఢిల్లీ బ్లాస్ట్‌లో 13 మంది చనిపోగా.. అనేక మంది గాయాలు పాలయ్యారు.

Tags

Next Story