Farmers Protest Delhi: రైతు ఉద్యమం 2.0

డిమాండ్ల సాధనకై దిల్లీ బాట పట్టిన రైతు సంఘాలను హరియాణ, పంజాబ్ సరిహద్దు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. శంభు, జింద్ సరిహద్దు ప్రాంతాల ద్వారా దిల్లీ వెళ్లేందుకు కర్షకులు యత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. శంభు సరిహద్దు నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన కర్షక సంఘాలపై పోలీసులు భాష్ప వాయుగోళాలు ప్రయోగించడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. జింద్ వద్ద కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. పంజాబ్, హరియాణ సరిహద్దుల నుంచి రైతులు దిల్లీ వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.
కనీస మద్దతు ధర కోసం చట్టం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూదిల్లీకి బయలుదేరిన రైతు సంఘాలను.... హరియాణా, పంజాబ్ సరిహద్దుల్లోనే పోలీసులునిలువరిస్తున్నారు. పంజాబ్‌లోని ఫతేగడ్ సాహిబ్ నుంచి రైతులు ట్రాక్టర్లతో రెండు మార్గాల్లో బయలుదేరారు. ఒక బృందం శంభు సరిహద్దు మార్గంలో......... మరొకటి జింద్ సరిహద్దు దారిలో హరియాణ మీదుగా దిల్లీ వెళ్లేందుకుప్రయత్నిస్తోంది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో బయలుదేరిన రైతులను శంభు వద్ద నుంచి ముందుకు కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముళ్లకంచెలు, కాంక్రీటు దిమ్మెలు, మేకులను రోడ్డుకు అడ్డుగా పెట్టి రైతులను నిలువరించేందుకు ప్రయత్నించారు. బారికేడ్లను ట్రాక్టర్లతో తొలిగించేందుకు యత్నించిన రైతులపై పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు.
శంభు వద్ద భాష్పవాయుగోళాలతో పాటు జలఫిరంగులనూ రైతులపై ప్రయోగించారు. భారీసంఖ్యలో ట్రాక్టర్లు,ఇతర వాహనాలలో శంభు సరిహద్దుకు చేరుకున్న రైతులు అడ్డుగా నిలిచిన పోలీసులపై రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు డ్రోన్ల ద్వారా భాష్పవాయుగోళాలు జార విడిచారు. అయినాసరే బెదరకుండా ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నాలు కొనసాగించారు. శంభు వద్ద వంతెనకు రక్షణగా పెట్టిన రేకులను ధ్వంసం చేసి కిందపడేశారు. మరింతముందుకు దూసుకెళ్లేందుకు యత్నించిన కర్షకులపై పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. ప్రస్తుతం శంభు సరిహద్దు వద్దే రైతులకు, పోలీసులకు మధ్య ప్రతిఘటన జరుగుతోంది. డ్రోన్ల సాయంతో భాష్పవాయుగోళాలను జారవిడుస్తూ ముందుకు కదలకుండా అడ్డుకుంటున్నారు.
మరోవైపు దేశ రాజధాని మొత్తం.. పోలీసుల పహారా కొనసాగుతోంది. 144 సెక్షన్ విధించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల సమన్వయంతో రైతులు ఎటు నుంచి వస్తారో అంచనా వేసి.. ఆయా ప్రాంతాల వద్ద పోలీసులతో పాటు RPF బలగాలను.. మోహరించారు. ఘాజీపూర్ సరిహద్దు వద్ద కాంక్రీట్ బారికేడ్లతో రహదారిని మూసివేశారు. వాహనాలను తనిఖీచేసిన తర్వాత దిల్లీలోకిఅనుతిస్తున్నారు. టిక్రీ సరిహద్దులను కూడా మూసివేశారు. పోలీసు బలగాలను, క్విక్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు. డ్రోన్లతో సైతం ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్లతో.. దిల్లీలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాజీపూర్, టిక్రీ, దిల్లీ-నోయిడా చిల్లా సరిహద్దు వద్ద వందలాది వాహనాలు అత్యంత నెమ్మదిగా ముందుకుకదులుతున్నాయి. ఒక కిలోమీటరు దూరానికి గంట పడుతోందని... చోదకులు అసహనం వ్యక్తంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com