Delhi Chalo: నేడు పంజాబ్ రైతుల ఢిల్లీ మార్చ్
పంజాబ్ రాష్ట్రంలోని శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం ఈ రోజు (డిసెబర్ 6) దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్‌గా బయలు దేరుతుందని రైతు నాయకుడు స్వరణ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్ చేయడంతో పాటు వివిధ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు గత కొన్నాళ్లుగా నిరసన చేస్తున్నారు.
అయితే, రైతుల మార్చ్ దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు అలర్ట్ అయ్యారు. సీనియర్ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా పంజాబ్‌లోని మన్సా దగ్గర బఠిండా వైపుగా 50 వాహనాల్లో వెళ్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో పలు ప్రాంతాల్లో ఘర్షణ తలెత్తింది. ఈ గొడవలో ముగ్గురు పోలీసులకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిపాదిత గ్యాస్ పైప్‌లైను కోసం చేపట్టిన భూసేకరణకు అందించే నష్ట పరిహారం చాలా తక్కువగా ఉందని సదరు రైతన్నలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
డిమాండ్ల సాధనకు రైతుల పాదయాత్రను పురస్కరించుకుని ఇప్పటికే ఎన్‌హెచ్ 44పై రైతులు పెద్దయెత్తున గుమిగూడి ఉన్న క్రమంలో హర్యానా, పంజాబ్‌లు శంభు సరిహద్దుకు రెండు వైపులా భద్రతను మరింత పటిష్ఠం చేశాయి. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటాన్ని నిషేధించే 163 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కేంద్ర పారా మిలటరీ బలగాలను ఇప్పటికే మోహరించారు. గురువారం హర్యానా పోలీసులు పంజాబ్ వైపు సరిహద్దులో అదనంగా మూడంచెలబారికేడ్లనుఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com