Farmers Protest: మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్‌

Farmers Protest: మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్‌
400 పైగా రైతు సంఘాలతో

రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14న ఢిల్లీలో కిసాన్‌ మహా పంచాయత్‌ను నిర్వహించనున్నట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా శనివారం తెలిపింది. దీనిలో 400కుపైగా రైతు సంఘాలు పాల్గొంటాయని చెప్పింది. వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చట్టాన్ని ఆమోదించడంతోపాటు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు దీనిని నిర్వహిస్తున్నట్లు వివరించింది. 37 రైతు సంఘాలు శనివారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న రైతులపై కేంద్ర ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా, మార్చి 14న ఢిల్లీలో భారీ కిసాన్‌ మజ్దూర్‌ మహా పంచాయత్‌ నిర్వహణకు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. రైతుల మధ్య చీలిక తెచ్చేందుకు కేంద్రం పన్నిన కుట్రలో భాగమే మొన్న జరిగిన కాల్పుల ఘటన అని ఎస్‌కెఎం విమర్శించింది. ఈ కాల్పులకు నైతిక బాధ్యత వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, హర్యానా సిఎం, ఎంఎల్‌ ఖట్టర్‌ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. రైతులపై దమనకాండకు పాల్పడిన పోలీసులపై సెక్షన్‌ 302 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిచేత విచారణ జరిపించాలని ఎస్‌కెఎం డిమాండ్‌ చేసింది.

పోలీసులు ధ్వంసం చేసిన 100 టక్టార్లకు మరమ్మత్తుల ఖర్చులు ఇవ్వాలని కూడా కోరింది. మాజీ ఎస్‌కెఎం సభ్యులతో సంప్రదింపులు జరపడానికి జనరల్‌ బాడీ సమావేశం ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో హన్నన్‌ మొల్లా, జోగిందర్‌ సింగ్‌ ఉగ్రహన్‌, బల్బీర్‌ సింగ్‌ రాజేవాల్‌, యుధవీర్‌ సింగ్‌, దర్శన్‌ పాల్‌, రమీందర్‌ పాటియాలా కమిటీ సభ్యులుగా ఉన్నారు.

మార్చి14న జరిగే మహా పంచాయత్‌కు సంఘీభావంగా విద్యార్థులు, యువత, మహిళలు, సాంస్కృతిక కార్యకర్తలు, చిరు వ్యాపారులు సహా అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story