Farmers Protest: రైతుల ‘ఛలో ఢిల్లీ’ సింగు బార్డర్ వద్ద భారీగా రైతులు

రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో 'ఢిల్లీ ఛలో' మార్చ్ నిర్వహించేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో సింగు బార్డర్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఈ రైతు ఉద్యమానికి పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ సింగ్ సబ్రా నాయకత్వం వహిస్తున్నాయి. ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ ఆందోళనలో 200 రైతు సంఘాలు పాల్గొన్నాయి. అసంపూర్తిగా మిగిలిపోయిన ఆందోళనను పూర్తి చేయడానికి 9 రాష్ట్రాల రైతు సంఘాలు ముందుకు వచ్చాయి. పుదుచ్చేరి, కర్ణాటక, తమిళనాడు,మధ్యప్రదేశ్, యూపీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్ ఇలా అన్ని రాష్ట్రాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. బారికేడ్లతో నగర సరిహద్దులను మూసివేశారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న రైతుల ప్రధాన డిమాండ్లు ఏమిటన్నది ఒకసారి పరిశీలిద్దాం. ఈ డిమాండ్లలో ప్రధానమైనది.. పంటలకు కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చే చట్టం చేయాలన్నది. మార్కెట్‌లో అనిశ్చితితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు హామీ లభించాలని రైతులు కోరుతున్నారు. విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం చెల్లింపు, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసుల ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ధర్మా చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదయిన కేసుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన ‘కనీస మద్దతు ధర’కు’ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక భూసేకరణ చట్టం-2013 పునరుద్దరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com