MP HC Slams Demolition: ఇండ్ల కూల్చివేత ఫ్యాషన్ అయిపోయిందన్న మధ్యప్రదేశ్ హైకోర్టు

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఓ మహిళ ఇల్లు కూల్చివేతపై ఆ రాష్ట్ర హైకోర్టు ఇండోర్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. మున్సిపల్ అధికారులు అమె ఇంటిని తప్పుగా కూల్చివేశారని పేర్కొన్న న్యాయస్థానం.. సరైన ప్రక్రియ అనుసరించకుండా ఇండ్లు కూల్చివేయడం స్థానిక పాలనా సంస్థలు, అధికారులకు ‘ఫ్యాషన్’ అయిపోయిందంటూ అసహనం వ్యక్తం చేసింది. బాధిత మహిళకు రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
త్తర్‌ప్రదేశ్‌లో మొదలైన బుల్డోజర్ కూల్చివేతలు క్రమంగా ఇతర రాష్ట్రాలకు వ్యాపిస్తున్నాయి. ఏదైనా కేసులో నిందితులుగా, దోషులుగా గుర్తించిన వారికి సంబంధించిన అక్రమ కట్టడాలను స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చి వేస్తున్నారు. అయితే ఇలా ఇళ్లు కూల్చి వేయడంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బుల్డోజర్ కూల్చివేతలు ప్రస్తుతం ఫ్యాషన్‌గా మారిపోయాయని తీవ్ర స్థాయిలో మండిపడింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీకి చెందిన రాధా లాంగ్రీ అనే మహిళ ఇంటిని స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆ ఇంటిని అక్రమంగా నిర్మించారని పేర్కొంటూ బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. అయితే ఈ వ్యవహారంపై బాధితురాలు మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. తన ఇల్లు నిబంధనల ప్రకారమే కట్టారని.. మున్సిపల్ అధికారులు కావాలనే తప్పుగా తన ఇంటిని కూల్చి వేశారని మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్‌కు మొర పెట్టుకుంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ వివేక్ రుషియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. చట్టంలోని విధి విధానాలు పాటించకుండా ఏ ఇంటినైనా కూల్చివేయడం స్థానిక పరిపాలన, స్థానిక సంస్థల అధికారులకు ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందని తీవ్ర విమర్శలు చేసింది. ఇంటిని క్రమబద్ధీకరించడానికి సరైన అవకాశం ఇచ్చిన తర్వాతే కూల్చివేతను చివరి మార్గంగా ఎంచుకోవాలని ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు సూచించింది. మరోవైపు అన్ని అనుమతులు లేకుండా, నిబంధనలు పాటించకుండా ఇల్లు నిర్మించుకునే హక్కు ఎవరికీ లేదని కూడా హైకోర్టు పేర్కొంది. ఇళ్లు, భవనాలకు సంబంధించి నకిలీ పత్రాలు తయారు చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com