Father Suicide: కుమార్తె కులాంతర వివాహం.. తండ్రి ఆత్మహత్య

కుటుంబ సభ్యుల ఇష్టానికి విరుద్ధంగా కూతురు పెళ్లి చేసుకున్న కారణంగా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. 49 ఏళ్ల మెడికల్ స్టోర్ యజమాని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రిషిరాజ్ అలియాస్ సంజూ జైస్వాల్‌గా గుర్తించిన ఆ వ్యక్తి తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుున్నాడు.
రిషిరాజ్ కుమార్తె 15 రోజుల క్రితం పొరుగున ఉన్న ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. ఇతను వేరే కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. కూతురు పెళ్లితో రిషి రాజ్ కుంగిపోయాడు. యువకుడితో వెళ్లిపోయిన ఆమెను ఇండోర్‌లో గుర్తించి, ఇంటికి తీసుకువచ్చారు. కోర్టు విచారణలో తాను చట్టబద్ధంగా వివాహం చేసుకున్నానని, తన భర్తతో వెళ్లాలని నిర్ణయించుకుంటున్నట్లు చెప్పింది.
ఇప్పుడు, రిషి రాజ్ సూసైడ్ నోట్ అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. తన కుమార్తె ఆధార్ కార్డ్ ప్రింటవుట్‌పై నోట్ రాశాడు. ‘‘హర్షితా నువ్వు తప్పు చేశావు, నేను వెళ్లిపోతున్నాను. నేను మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని, కానీ నా కూతురిని నేను ఎలా చంపగలను..?, ఒక కూతురిగా నువ్వు చేసింది సరైనది కాదు. డబ్బు కోసం కుటుంబాన్ని లాయర్ నాశనం చేశాడు, అతడికి కుమార్తెలు లేరా..? తండ్రి బాధ అతడికి అర్థం కాదా..? ఒక కుటుంబం మొత్తం నాశనం అయింది, ఇప్పుడు సమాజంలో మాకు ఏమీ మిగలలేదు’’ అంటూ భావోద్వేగంతో ఆత్మహత్యకు ముందు లేఖ రాశారు.
నోట్‌లో అతడు చట్టపరమైన ప్రక్రియను ప్రశ్నించారు. ‘‘నేను మళ్లీ చెబుతున్నాను, ఆర్యసమాజ్ కింద వివాహం చెల్లకపోతే, కోర్టు ఆ అమ్మాయిని తన భాగస్వామితో వెళ్లేందుకు ఎలా అనుమతించింది..? ఇది మా మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. నా బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు’’ అని లేఖలో పేర్కొన్నాడు.
ఈ ఘటనపై ఎస్పీ నిరంజన్ శర్మ మాట్లాడుతూ.. ఇది చాలా విషాదకమైన సంఘటన అని అన్నారు. అమ్మాయి వేరే వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంది. తండ్రి కొన్ని రోజులుగా నిరాశలో ఉన్నాడని చెప్పారు. రిషి రాజ్ నాకా చంద్రబాద్ని ప్రాంతంలో మెడికల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈ ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. పెళ్లి చేసుకున్న యువకుడి తండ్రిపై రిషిరాజ్ బంధువులు దాడి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com