ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన.. సీఎం యోగికి ప్రధాని ఫోన్

ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన.. సీఎం యోగికి ప్రధాని ఫోన్
ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన... మరోసారి దేశాన్ని కలిచివేసింది. సెప్టెంబర్‌ 19న తల్లితో కలిసి పొలానికి వెళ్లిన దళిత యువతిని నలుగురు నిందితులు..

ఉత్తరప్రదేశ్‌లో నిర్భయ తరహా ఘటన... మరోసారి దేశాన్ని కలిచివేసింది. సెప్టెంబర్‌ 19న తల్లితో కలిసి పొలానికి వెళ్లిన దళిత యువతిని నలుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రతిఘటించాలని ప్రయత్నించిన ఆమెను..చున్నీతో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించారు.ఈ ఘటనలో యువతి తీవ్రంగా గాయపడింది. నాలుక తెగిపోయి, వెన్నెముకకు గాయాలతో, చేతులు పాక్షికంగా, కాళ్లు పూర్తిగా చచ్చుబడిపోయింది. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీకి తరలించారు.10 రోజులపాటు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడిన దళిత యువతి చివరికి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తెల్లవారు జామున చనిపోయింది..

అయితే... బాధితురాలి మృతదేహాన్ని ఆమె ఇంటికి కూడా తీసుకెళ్లలేదు పోలీసులు. అర్థరాత్రి ఆమె స్వగ్రామం హత్రాస్‌లో కుటుంబ సభ్యుల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా రహస్యంగా అంత్యక్రియలు చేశారు. చివరికి కుటుంబ సభ్యులను కూడా అంత్యక్రియలకు అనుమతించలేదు. కడసారి చూస్తామని బతిమిలాడినా వినలేదు. దీనిపై యువతి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. రేపిస్టులను ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. యూపీ సర్కార్ వైఫల్యంపై... విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. తక్షణమే నేరస్తులకు శిక్షలు పడాలని డిమాండ్‌ చేశాయి..

ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న సీఎం యోగి ఆదిత్యనాథ్‌....దర్యాప్తు కోసం ముగ్గురు అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందానికి హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రప్రకాష్, ఐపిఎస్ అధికారి పూనమ్ నాయకత్వం వహించనున్నారని చెప్పారు. వారం రోజుల్లో దర్యాప్తు చేసి SIT తన నివేదిక ఇస్తుందన్నారు. నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా విచారణ జరిపేలా చర్యలు తీసుకుంటామన్నారు.. ఈ ఘటనలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం యోగికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మోదీ సూచించారు.

Tags

Next Story