RAHUL: ఇంత బాధ ఎప్పుడూ పడలేదు

వయనాడ్‌లోని కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాల్లో.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా 206 మంది జాడ తెలియడం లేదు. మృతుల సంఖ్య 190కి చేరుకుంది. వారిలో 25 మంది పిల్లలు, 70 మంది మహిళలు ఉన్నారు. మరో 200 మందికిపైగా గాయాలయ్యాయి. అనధికార సమాచారం ప్రకారం మృతులు 276 మంది అని తెలుస్తోంది. మొత్తం 279 పోస్టుమార్టంలను పూర్తి చేశామని వైద్య బృందాలు వెల్లడించాయి. అయితే ఇందులో కొన్ని పూర్తి మృత దేహాలకు కాకుండా శరీర భాగాలకు నిర్వహించినవి ఉన్నాయి. శిథిలాల నుంచి ఇప్పటిదాకా 100 శరీర భాగాలను వెలితీసినట్లు అధికారులు వెల్లడించారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం తనను ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన వారి బాధ కలచివేస్తోందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతీయ విపత్తని ఆయన అభివర్ణించారు. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేశారు. వయనాడ్ మాజీ ఎంపీ అయిన ఆయన తన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో కలిసి కొండ చరియలు విరిగిపడిన చూరాల్‌మలలో పర్యటించారు. బురద పేరుకుపోయిన ప్రాంతాల్లో వర్షంలోనే తిరిగారు. ఆ తరువాత మెప్పడిలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించారు. అక్కడే ఇంకా గుర్తించని మృతదేహాలను దాచి ఉంచారు. శుక్రవారం కూడా వయనాడ్‌లోనే ఉండాలని ఇద్దరు నేతలు నిర్ణయించారు.
పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు ఇక్కడికి వచ్చామని... ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలతో మాట్లాడటానికీ మాటలు రావడం లేదన్నారు. వారికేం చెప్పాలో తెలియడం లేదన్నారు. ఇది తన జీవితంలోనే అత్యంత విషాదకరమైన రోజని.. తన తండ్రి చనిపోయిన రోజు పడ్డ ఆవేదన ఇప్పుడు పడుతున్నా అని రాహుల్ గాంధీ అన్నారు. ‘బాధితుల ఆవేదన తీర్చలేనిదని... వారికి సాయం చేసేందుకే వచ్చామని.. సాధ్యమైనంతగా వారికి అండగా నిలుస్తామని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. స్థానికులు మరో ప్రాంతానికి తరలి వెళ్లేందుకు అంగీకరించడం లేదని.... వారికి ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం స్పందించాల్సి ఉందని ఇద్దరు నేతలు వ్యాఖ్యానించారు.
బైడెన్ సంతాపం
కేరళ ప్రమాద మృతులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. జిల్ బైడెన్‌తోపాటు తాను మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు తమ అండ ఉంటుందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com