Family Pension: మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛను
కుటుంబ పెన్షన్ విధివిధానాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు, కూతురిని నామినీగా ఎంచుకోవచ్చునని తెలిపింది. గతంలో మహిళా ఉద్యోగులకు ఈ సౌకర్యం లేదు. ఇంతకముందు వరకు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి లేదా పెనర్షనర్ యొక్క జీవిత భాగస్వామ్యానికి కుటుంబ పెన్షన్ ఇచ్చేవారు. జీవిత భాగస్వామి అనర్హత లేదా మరణం తరువాత మాత్రమే ఇతర కుటుంబ సభ్యులు అర్హులుగా ఉండేవారు.
ఈ కొత్త నిబంధన వల్ల భర్తతో కలిసి ఉండని, విడాకులు తీసుకున్న మహిళలకు ఉపశమనం కలిగిస్తుంది. అలాంటి మహిళలు తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవచ్చు. నామినీగా భర్తను కాకుండా పిల్లలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ పిల్లలు మైనర్లు అయినా, దివ్యాంగులు అయినా ఆ పెన్షన్ పిల్లల సంరక్షకులకు వెలుతుంది. పిల్లలు మేజర్లు అయిన తరువాత వారు నేరుగా పొందుతారు. మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న మహిళలకు న్యాయమైన, చట్టబద్ధమైన హక్కులను అందించాలనే ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా & లింగ సమానత్వం, సాధికారత దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళలకు చట్టపరమైన సంక్లిష్టతలను తొలగించడమే కాకుండా, స్త్రీ శ్రామిక శక్తికి మరింత సహాయక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నంగా వెల్లడించారు.
ఇప్పటివరకూ ఉన్న నిబంధనల ప్రకారం, మహిళా పింఛనుదారు తన తదనంతరం కుటుంబ పింఛన్‌ను భర్తకు, అతడి మరణానంతరం పిల్లలకు చెందేలా పేర్లను ప్రతిపాదించేవారు. ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా 2021 నాటి కేంద్ర పౌర సర్వీసుల నిబంధనలను కేంద్ర పింఛన్, పింఛన్‌దారుల సంక్షేమ విభాగం సవరించింది. అయితే, ఈ సౌలభ్యం పొందాలనుకున్న పింఛనుదారులు లిఖిత పూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది. ఈ అభ్యర్థన లేఖలో తప్పనిసరిగా తన భర్త కంటే ముందు కొడుకు లేదా కూతురు కుటుంబ పించన్ ఇవ్వాలని పేర్కొనాలి. ఒకవేళ పిల్లలు లేకుంటే ఆమె భర్తకే పింఛన్ వస్తుంది. లేఖ ప్రకారం ఆమె మరణానంతరం ఫించన్ ను అందిస్తారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com