Bengaluru Metro: మెట్రోలో రైతన్నకు అవమానం..

Bengaluru Metro:  మెట్రోలో రైతన్నకు అవమానం..
బట్టలు మురికిగా ఉన్నాయని అడ్డుకున్న సిబ్బంది..

దుస్తులు మురికిగా ఉన్నాయన్న కారణంతో మెట్రో స్టేషన్ లోకి వెళ్లకుండా ఓ రైతును సిబ్బంది అడ్డుకున్న అమానవీయ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు ఈ నెల 24న సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు.


సాధారణంగా రైతులు అంటే మాసిపోయిన గడ్డం, మురికిపట్టిన బట్టలతో ఉంటారు. ఎందుకంటే రేయింబవళ్లు శ్రమించి ఈ దేశానికి అన్నం పె ట్టే అన్నదాటకి అందం మీద ధ్యాస ఉండదు. అయితే వారికి చాలా చోట్ల దక్కే గౌరవం మాత్రం చాలా తక్కువే. చాలా మంది రైతులను చులకనగా, హీనంగా చూస్తూ ఉంటారు. తాజాగా ఓ మసలి రైతును మెట్రో రైలు ఎక్కకుండా అడ్డుకున్న ఘటన పెను దుమారానికి కారణం అయింది.

మాసిన చొక్కా, పంచను ధరించిన రైతు తల మీద బరువు మోస్తూ రాజాజీనగర్ మెట్రోస్టేషన్ కు వెళ్లారు. మెట్రో టికెట్ తీసుకున్న రైతును, చెకింగ్ పాయింట్ వద్దే మెట్రో సిబ్బంది లోనికి వెళ్లకుండ అడ్డుకున్నారు. దీన్ని గమనించిన తోటి ప్రయాణికులు టికెట్ ఉన్నా నిషేధిత వస్తువులేవి రైతు వద్ద లేకున్న..ఎందుకని లోనికి అనుమతించలేదని ప్రశ్నించారు. రైతు వేసుకున్న దుస్తులు సరిగా లేవని నిర్వాహకులు బదులిచ్చారు. ఈ సమధానం విన్న ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించాలంటే డ్రస్ కోడ్ ఏమైనా ఉంటే ఆ నియమాన్ని చూపించాలని కోరారు. ఇది కేవలం VIPల కోసమే ఏర్పాటు చేసిన రవాణా వ్యవస్థా అని సిబ్బందిని ప్రశ్నించారు. ఈ విషయాలన్నింటినీ మరో వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టగా.. అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌ కావడమే కాకుండా బెంగళూరు మెట్రో వ్యవస్థను విమర్శలు పాలుచేసింది. మెట్రో రైలు కేవలం వీఐపీలకేనా, సామాన్యులు ఎక్కకూడదా అంటూ నెటిజన్లు మెట్రో అధికారులపై విమర్శలు కురిపించారు. . ఈ వీడియో వైరల్ కావడంతో బెంగళూరు మెట్రో సిబ్బంది తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. రైతును అలా అవమానించడం ఏంటని తీవ్రంగా తిట్టిపోస్తున్నారు. ఇక ఈ వ్యవహారాన్ని పట్టించుకోకుండా వెళ్లిపోకుండా అక్కడే ఉండి మెట్రో సిబ్బందిని ప్రశ్నించిన ఆ ప్రయాణికుడిని ప్రశంసిస్తున్నారు.

దీనిపై స్పందించిన బీఎంఆర్‌సీఎల్‌ ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది, రైతుకు జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్తంచేస్తూ.. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తునట్లు వెల్లడించింది.


Tags

Next Story