Delhi Road Accident: న్యూఢిల్లీలో రోడ్డుప్రమాదం.. ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ మృతి

ప్రమాదంలో ఆయన భార్య సందీప్ కౌర్‌కు తీవ్ర గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ సమీపంలోని రింగ్ రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బీఎండబ్ల్యూ కారు.. వారి మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నవ్‌తోజ్ సింగ్ (52), తన భార్య సందీప్ కౌర్‌తో కలిసి బంగ్లా సాహిబ్ గురుద్వారా నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గగన్‌ప్రీత్ అనే మహిళ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారు వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్‌తోజ్ సింగ్ మృతి చెందగా, సందీప్ కౌర్ తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఆసుపత్రులు ఉన్నప్పటికీ, తన తల్లిదండ్రులను సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీటీబీ నగర్‌లోని నులైఫ్ ఆసుపత్రికి ఎందుకు తరలించారని ఆయన ప్రశ్నించారు. "ప్రమాదం జరిగిన తర్వాత, కారు నడిపిన మహిళ కూడా గాయపడినట్లు చెప్పి మా తల్లిదండ్రులతో పాటు ఆసుపత్రికి వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె ఆచూకీ లేదు. ఆమెకు ఫేక్ మెడికో-లీగల్ సర్టిఫికెట్ తయారు చేసేందుకు ఆసుపత్రి సిబ్బంది సహకరిస్తున్నారని నేను అనుమానిస్తున్నాను" అని ఆయన ఆరోపించారు.

ప్రమాదం జరిగిన వెంటనే కారు నడిపిన గగన్‌ప్రీత్, ఆమె భర్త పరీక్షిత్ కలిసి క్షతగాత్రులను ఓ ట్యాక్సీలో ఆసుపత్రికి తరలించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పక్కకు పడి ఉన్న బీఎండబ్ల్యూ కారును, డివైడర్ వద్ద ఉన్న మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరించాయి. ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Tags

Next Story