Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాంతో రాజకీయ ప్రకంపనలు.. ఎఫ్ఐఆర్‌లో 15 మంది పేర్లు..

Delhi: ఢిల్లీ లిక్కర్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు కూడా పలువురికి పేర్లు బయటికి రావడంతో.. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను చేర్చింది సీబీఐ. వీరితోపాటు ఇతరులూ అని చేర్చింది. దీంతో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొమ్మిది నెలలపాటు అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకున్నదనేది ప్రధాన ఆరోపణ.ఈ పాలసీ గత నెలనే రద్దు చేశారు. 11 పేజీల ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరపూరిత కుట్ర, ఫాల్సిఫికేషన్‌లు ప్రధాన ఆరోపణలుగా సీబీఐ చేర్చింది.
లిక్కర్ స్కాంలో తన పేరు బయటికి రావడంతో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసులు మూసివేయాలంటే బీజేపీలో చేరాలంటూ తనకు మెస్సెజ్ వచ్చిందన్నారు. అయితే తానొక రాజ్‌పూత్‌నని.. మహారాణా ప్రతాప్ వారసుడినన్నారు. తలనైనా నరుక్కుంటాను కానీ.. అవినీతి,కుట్రల ముందు తల వంచేది లేదన్నారు. తనపై పెట్టినవన్ని తప్పుడు కేసులేనని ఆరోపించారు. ఏం చేసినా సిద్ధమేనన్నారు. తనపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసినట్లు తెలిపారు సిసోడియా. తాను దేశం విడిచి వెళ్లకుండా నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
అయితే సీబీఐ మాత్రం.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న వారికి ఎల్‌వోసీ జారీ చేసినట్లు తెలిపింది. సిసోడియా సహా నలుగురు నేతలపై లుకౌట్ నోటీసులు జారీ కాలేదన్నారు సీబీఐ అధికారులు. మరోవైపు మనీష్ సిసోడియాను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించాలంటూ సీఎం కేజ్రీవాల్ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు. తక్షణమే సిసోడియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బారికేడ్లను తొలగించి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు బీజేపీ కార్యకర్తలు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
సిసోడియాను డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు కమలనాథులు. సీఎం కేజ్రీవాల్ అవినీతిని ప్రోత్సహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. కోట్ల రూపాయల స్కాం బయటికి వచ్చినా.. సిసోడియాను వెనకేసుకొచ్చేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు. గతేడాది నవంబర్‌లో కేజ్రీవాల్ సర్కార్ తెచ్చిన న్యూ లిక్కర్ పాలసీలు అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మద్యం విధానంలో నిబంధనల ఉల్లంఘన జరగడంతో పాటు విధానపరమైన లోపాలున్నట్లు ఢిల్లీ సీఎస్ నివేదిక ఇచ్చారు.టెండర్ల విధానంలో కొందరికి లబ్ధి చేకూరేలా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో వెల్లడించారు. దీంతో ఈ ఉల్లంఘనలపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. సీబీఐకి సిఫార్సు చేశారు. మొత్తానికి.. లిక్కర్ స్కాం ఢిల్లీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సమస్యనుంచి కేజ్రీవాల్ సర్కారు ఎలా బయటపడుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com