Delhi Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు..

ఆరుగురికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్‌-1 పైకప్పులో కొంత భాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయన్ని రక్షించారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీ లోని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండోరోజూ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. మరోవైపు టెర్మినల్‌-1 నుంచి బయలుదేరే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.

ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఇచ్చిన సమాచారం ప్రకారం “ఉదయం 5.30 గంటలకు, ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోవడం గురించి మాకు సమాచారం అందింది. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక వాహనాలను పంపించారు. అక్కడ మంటలు చెలరేగినట్లు గుర్తించారు. దీని తరువాత, విమానాశ్రయం పైకప్పు ఒక భాగం కూలిపోయింది. కింద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పలు వాహనాలు పైకప్పు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిని రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించాం."

ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన సంఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. టెర్మినల్‌-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

Tags

Next Story