Delhi: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో అగ్నిప్రమాదం .. బయటపడ్డ పెద్ద నోట్ల కట్టలు

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో వర్మ ఇంట్లో లేరు. దీంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. ఆ సమయంలో ఇంట్లోకి వెళ్లి చూడగా.. షాకింగ్ దృశ్యాలు చూసి అవాక్కయ్యారు. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా.. తనిఖీ చేసి ఆ డబ్బంతా లెక్కల్లో చూపించని బ్లాక్ మనీగా గుర్తించారు.
ఈ సమాచారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నాకు చేరింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ఖన్నా.. వెంటనే కొల్లీజియం సమావేశం ఏర్పాటు చేసి.. వర్మను అలహాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అయితే ఈ పరిణామంతో న్యాయశాఖ ఇమేజ్ దెబ్బతిన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐదుగురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగిరాదన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో.. ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఇటువంటి ఘటనే 2008 ఆగస్టు 13వ తేదీన ఒకటి చోటుచేసుకొంది. నాటి పంజాబ్-హరియాణా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి ఎదుట రూ.15 లక్షల నోట్లు ఉన్న బాక్స్‌ను కొందరు వ్యక్తులు ఉంచారు. ఈవిషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకు అప్పగించారు. దర్యాప్తు అనంతరం 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ నిర్మల్ యాదవ్‌పై అభియోగాలు నమోదు చేశారు. ఆమె 2009 వరకు పంజాబ్-హరియాణా కోర్టులో పనిచేశారు. ఓ కేసులో తీర్పు నిమిత్తం నిర్మల్ యాదవ్‌కు ఇవ్వాల్సిన డబ్బును పొరబాటున జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ ఇంటి వద్ద పెట్టినట్లు తేలింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com