Jharkhand Election : నేడు జార్ఖండ్‌లో తొలి దశ పోలింగ్..

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ మొదలైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 81 నియోజకవర్గాలు ఉండగా 43 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ఇక దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ స్థానాలకు, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి కూడా ఉప ఎన్నికల పోలింగ్ షురూ అయింది. రాజస్థాన్‌లో 7, పశ్చిమ బెంగాల్‌లో 6, అస్సాంలో 5, బీహార్‌లో 4, కేరళలో 3, మధ్యప్రదేశ్‌లో 2, మేఘాలయ, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలో ఒక్కో సీటుకు పోలింగ్ జరుగుతోంది. కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి సెరైకెలా స్థానం నుండి పోటీ చేశారు. దీంతో పాటు ఆయన కుమారుడు బాబూలాల్ సోరెన్ ఘట్శిల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన తండ్రి చంపాయ్ సోరెన్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా బాబూలాల్ సోరెన్‌పై ఉంది. దీంతో పాటు రాష్ట్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ జోబా మాంఝీ కుమారుడు జగత్ మాంఝీ మనోహర్‌పూర్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. అదే సమయంలో, హేమంత్ సోరెన్ కేబినెట్‌లోని ఆరుగురు మంత్రుల రాజకీయ విశ్వసనీయత కూడా మొదటి దశలోనే ప్రమాదంలో పడింది. ఇందులో ఘట్‌శిల అభ్యర్థి రాందాస్ సోరెన్, మంత్రి కమ్ అభ్యర్థి డాక్టర్ రామేశ్వర్ ఓరాన్, మంత్రి దీపక్ బీరువా, మంత్రి బానా గుప్తా, మంత్రి మిథిలేష్ ఠాకూర్ ఉన్నారు.
ఝార్ఖండ్‌తో పాటు ఉప ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కట్టుదిట్టమైన భద్రతను మోహరించింది. కాగా ఝార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం పార్టీ అత్యధికంగా 30 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 25 స్థానాలకు పరిమితమైంది. జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మొత్తం 47 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
15344 పోలింగ్ స్టేషన్లు
మొదటి విడతలో 43 స్థానాలకు గాను 15344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇందులో పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 2628 కాగా, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 12716గా ఉంది. ఈ దశలో మొత్తం ఓటర్ల సంఖ్య 1 కోటి 36 లక్షల 85 వేల 509. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 68 లక్షల 65 వేల 208. అదే సమయంలో మహిళా ఓటర్ల సంఖ్య 68 లక్షల 20 వేలు. థర్డ్ జెండర్ ఓటర్ల సంఖ్య 301 కాగా, వికలాంగ ఓటర్ల సంఖ్య 191553.
నవంబర్ 20న రెండో దశ
నవంబర్ 20న జార్ఖండ్‌లో రెండో దశ పోలింగ్ జరగనుండగా, నవంబర్ 23న మహారాష్ట్ర ఎన్నికలతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఉంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ బంగ్లాదేశీయుల చొరబాటు అంశాన్ని లేవనెత్తింది.
10 రాష్ట్రాల్లోని 32 స్థానాలకు ఉప ఎన్నికలు
జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు 10 రాష్ట్రాల్లోని 32 స్థానాలకు బుధవారం ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 31 అసెంబ్లీ స్థానాలు ఉండగా, ఒక లోక్‌సభ స్థానం ఉంది. గతంలో 33 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, సిక్కింలోని రెండు అసెంబ్లీ స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికైనందున 31 స్థానాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 31 స్థానాల్లో 4 సీట్లు దళితులకు, 6 సీట్లు గిరిజనులకు, 21 సీట్లు జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేయబడ్డాయి. అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com