Delhi : లోక్‌సభ సమావేశాలు నేటి నుంచే
18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. 24, 25 తేదీల్లో ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అనంతరం 27న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ జూన్ 28న ప్రారంభం అవుతుందని, ప్రధాని మోదీ జూలై 2 లేదా 3న చర్చకు సమాధానం ఇచ్చే అవకాశం ఉన్నదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ముర్ము సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన భర్తృహరి మహతాబ్ చేత ప్రమాణం చేయించనున్నారు. . కాగా, ఈ సమావేశాల తర్వాత స్వల్ప విరామం అనంతరం జూలై 22న పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఉభయ సభలు తిరిగి సమావేశం కానున్నాయని పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రొటెం స్పీకర్ అంశంపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య వివాదం కొనసాగుతున్నది. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా ఏడు సార్లు ఎంపీగా ఎన్నికైన భర్తృహరి మహతాబ్‌ను నియమించినట్టు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల చేసిన ప్రకటనపై ఇండియా కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భర్తృహరి కంటే కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ సీనియర్ అని, దళితుడైనందు వల్లే సురేశ్‌కు ప్రొటెం స్పీకర్ పదవి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. విపక్షాల ఆరోపణలపై కిరణ్ రిజిజు స్పందిస్తూ ప్రొటెం స్పీకర్‌గా మహతాబ్ ఎంపికను సమర్థించుకున్నారు. మహతాబ్ వరుసగా ఏడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారని, సురేష్ అలా కాలేదని చెప్పారు. సురేశ్ 2004 ముందు నాలుగుసార్లు, ఆ తర్వాత వరుసగా నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ అంశం లోక్‌సభ సమావేశాల్లో హాట్ టాపిక్‌గా మారే అవకాశం కనిపిస్తున్నది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com