Collide Two Boats: గోవాలో భారత ఫిషింగ్ బోట్ 'మార్తోమా', భారత నౌకాదళ నౌకలు ఢీ

గోవాలో భారత ఫిషింగ్ బోట్ ‘మార్తోమా’, భారత నౌకాదళ నౌకలు ఢీకొన్నాయి. 21 నవంబర్ 2024 సాయంత్రం గోవాకు వాయువ్యంగా 70 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. పడవలో 13 మంది సభ్యులు ఉండగా, అందులో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు మిగిలిన ఇద్దరు సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత, భారత నావికాదళం వెంటనే పెద్ద ఎత్తున సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం భారత నావికాదళం ఆరు నౌకలు, విమానాలను మోహరించింది.
దీనితో పాటు, ముంబైకి చెందిన మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ (MRCC) సహకారంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేస్తున్నారు అధికారులు. ఇండియన్ నేవీ వెంటనే సమీపంలోని ఓడలు, విమానాలను అక్కడికి పంపింది. తద్వారా ప్రాణాలతో బయటపడిన వారిని వీలైనంత త్వరగా ఒడ్డుకు చేర్చారు. నౌకాదళ నౌకలు, విమానాలు కాకుండా.. ఇతర వనరులు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. గోవా, ముంబై తీర ప్రాంతాల్లో ఉన్న ఏజెన్సీలు కూడా పూర్తి సంసిద్ధతతో ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయితే, ఈ ఘర్షణ ఎలా జరిగిందన్న విషయం ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేపడతామని, అయితే ప్రస్తుతం గల్లంతైన మత్స్యకారుల ఆచూకీకే ప్రాధాన్యతనిస్తున్నారు నేవీ అధికారులు. ఈ ఘటన సముద్ర భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన తాజా సమాచారం త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గల్లంతైన సభ్యులను సురక్షితంగా రక్షించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని నేవీ అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com