Aircraft: బెంగళూరులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఓ విమానం సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రన్‌వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. HAL ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరిన ప్రీమియర్ 1ఏ విమానం వీటీ-కేబీఎన్‌లో సాంకేతిక సమస్య ఎదురైంది. ఈ విమానం టేకాఫ్ అయిన తర్వాత ముందు వైపునున్న నోస్ ల్యాండింగ్ గేర్ రీట్రాక్ట్ అవలేదు. దీంతో విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు.
హాల్ ఎయిర్‌పోర్టులో విమానం దిగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో రన్‌వేపై నీరు నిలిచింది. ఆ నీటిలోనే విమానం ముందుకెళ్లింది. అప్పటికే నోస్ ల్యాండింగ్ గేర్ సరిగా లేకపోవడంతో ఒక్కసారిగా ముందుకు దొర్లింది. విమానం ముందు భాగం రన్‌వేను తాకి కొంతదూరం అలాగే ముందుకెళ్లింది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు డీజీసీఏ వెల్లడించింది. ఘటన సమయంలో విమానంలో ఇద్దరు పైలట్లు మాత్రమే ఉన్నారు. ప్రయాణికులెవరూ లేరని డీజీసీఏ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com