Cyrus Mistry : రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత..

Cyrus Mistry : రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూత..
Cyrus Mistry : టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ముంబై రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

Cyrus Mistry : టాటా గ్రూప్ మాజీ చైర్మన్, షాపూర్‌జీ-పల్లోంజీ గ్రూప్ ప్రస్తుత చైర్మన్ సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అహ్మదాబాద్ నుంచి ముంబై వెళుతుండగా పాల్గర్‌లోని ఛరోటీ దగ్గర కారు ప్రమాదానికి గురైంది. సూర్య నదిపై ఉన్న వంతెనపై డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. కారులో ఉన్న మరొకరు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.

1968 జులై 4వ తేదీన జన్మించిన సైరస్ మిస్త్రీ... లండన్‌ ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్‌, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో MSc చేశారు. 2006 నుంచి టాటా సన్స్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. 2011లో టాటా సన్స్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. 2012లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్‌నకు సైరస్‌మిస్త్రీ ఛైర్మన్‌ అయ్యారు. అప్పటికి 43 ఏళ్ల సైరస్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు 18 శాతం వాటా ఉంది.

అయితే, ఆ పదవి చేపట్టిన నాలుగేళ్లకే మిస్త్రీకి టాటా గ్రూప్‌ ఉద్వాసన పలికింది. ఆయనకు నిర్దేశించిన వివిధ లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ.. తన తొలగింపుపై న్యాయపోరాటం చేశారు. తన తొలగింపును సవాలు చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ కు వెళ్లారు. ఈ ఆరోపణలను పరిశీలించడానికి సైతం అర్హత లేదని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు సైరస్‌మిస్త్రీని వరించింది. అయితే... ఆ తర్వాత టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

Tags

Next Story