Ajay Jadeja: నవానగర్ మహారాజుగా భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా

భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా నవానగర్ రాజ్యపు మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నారు. నవానగర్ సంస్థానానికి కాబోయే మహారాజు (జామ్‌సాహెబ్ )గా జడేజా పేరును ప్రకటించారు. ఈ మేరకు నవానగర్ ప్రస్తుత జామ్‌సాహెబ్ శుక్రవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. ఇప్పుడు జామ్‌నగర్‌గా పిలువబడుతున్న నవానగర్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నది. అప్పట్లో నవానగర్ ప్రత్యేక రాజ్యంగా ఉండేది. జడేజా రాజ్‌పుత్ వంశానికి చెందిన రాజులు ఈ రాజ్యాన్ని పాలించేవారు.
ప్రస్తుతం నవానగర్ జామ్‌సాహెబ్ వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. దాంతో తన రాజసింహాసనాన్ని తన వారసుడైన అజయ్ జడేజాకు అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఆ రాజవంశం సంప్రదాయం ప్రకారం రాజు పదవులు వారసులకు సంక్రమిస్తున్నప్పటికీ పరిపాలన మాత్రం వాళ్ల చేతిలో లేదు. కాగా అజయ్ జడేజా ముత్తాత 1933లో ఇంగ్లండ్ జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడాడు.
అజయ్ జడేజా కూడా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. మంచి బ్యాటింగ్ నైపుణ్యంతోపాటు అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శన చేసేవాడు. అయితే 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కోవడంతో కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. బీసీసీఐ అతనిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసిన తర్వాత కూడా అతడిని తిరిగి భారత జట్టుకు ఎంపిక చేయలేదు. జడేజా ప్రస్తుతం క్రికెట్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com