Karnataka: కర్ణాటక మాజీ డీజీపీ అనుమానాస్పద మృతి

కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాష్ బెంగళూర్‌లోని తన ఇంట్లో శవంగా కనిపించాడు. అతడి ఒంటిపై పలు చోట్ల కత్తితో పొడిచిన గాయాలు ఉన్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి. అతడి భార్య పల్లవి ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లోని వారి నివాసంలో పల్లవి, ఓం ప్రకాష్‌ని హత్య చేసినట్లు తెలుస్తోంది.
కర్ణాటక కేడర్‌కు చెందిన 1981 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఓఎం ప్రకాష్, 2017లో పదవీ విరమణ చేయడానికి ముందు 2015లో డైరెక్టర్ జనరల్ మరియు ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ మరియు ఐజీపీ)గా పనిచేశారు. ఆదివారం, ఆయన తన ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా తేల్చారు. మృతుడి భార్య పల్లవి హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుమానించి, విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారు.
ఓం ప్రకాష్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక సమస్యలతో కుటుంబంలో ఉద్రిక్తతలు పెరిగినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నాడని, దీంతో ఇంట్లో తరుచుగా వాగ్వాదానికి దారి తీస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ఆర్థిక విషయాలే ఈ హత్యకు దారి తీసిందా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓం ప్రకాష్ తన ఆస్తిని భార్యకు కాకుండా నేరుగా కొడుకుకు బదిలీ చేశారని, దీంతోనే ఆమె కోపంతో ఈ హత్యకు పాల్పడొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఓం ప్రకాష్ స్వస్థలం బీహార్ రాష్ట్రంలోని చంపారన్. 1981 బ్యాచ్ ఐపీఎస్ అయిన ఈయన బళ్లారిలోని హరపనహళ్లీలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. శివమొగ్గ, ఉత్తర కన్నడ, చిక్క మగళూర్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ఆయన తన సర్వీసులో కర్ణాటక విజిలెన్స్ సెల్ ఎస్పీ, లోకాయుక్తలో పదవులు, అగ్నిమాపక సేవల డీఐజీ, సీఐడీ ఐజీపీ వంటి కీలక పదవులను నిర్వహించారు. 1993 భత్కర్ మత అల్లర్లలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2015లో డీజీపీ అండ్ ఐజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో పదవీ విరమణ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com