Oommen Chandy: కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ (Oommen Chandy) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటనను ఆయన కుమారుడు ధ్రువీకరించారు. గతంలో గొంతు సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. అనంతరం ఉత్తమ చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. అప్పటినుంచి ఆస్పత్రిలోనే ఉంటున్న 79 ఏళ్ల ఊమెన్ చాందీ ఆరోగ్యం క్షీణించి మరణించారు.
ఊమెన్ చాందీ 1943 అక్టోబరు 31న కొట్టాయం(KOTTAYAM) జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. అది మొదలు ఆయన విజయయాత్ర అప్రతిహతంగా సాగింది. ఇక అప్పటినుంచి ఓటమన్నదే లేకుండా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన 12 సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే విజయం సాధించారు. చాందీ 1977లో కె.కరుణాకరన్ కేబినెట్‌లో తొలిసారిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 2004- 2006 వరకు ఒకసారి, 2011 నుంచి 2016 వరకు రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు.
ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏనాడూ పార్టీ మారలేదు. కేరళ కాంగ్రెస్‌లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు చాందీ. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని కాంగ్రెస్ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com