Simranjit Singh Mann : కంగనాపై మాజీ ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన దీక్షలను బంగ్లాదేశ్ అల్లర్లతో పోల్చి మాట్లాడిన మండీ ఎంపీ కంగనా రనౌత్ (భాజపా)పై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నేత సిమ్రన్‌జీత్‌సింగ్ మాన్ మండిపడ్డారు. దేశంలో బలమైన నాయకత్వం లేకపోతే రైతుల ఆందోళనలతో మృతదేహాలు వేలాడేవి, అత్యాచారాలు జరిగేవంటూ కంగన ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి, ఖలిస్థాన్ ప్రతిపాదకుడైన సిమ్రన్‌జీత్‌సింగ్ మాన్‌ను కంగన వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా మీడియా కర్నాల్‌లో కోరింది. దీనిపై తీవ్రంగా స్పందించిన మాన్ ‘రేప్’ అనే పదం వాడుతూ కంగనాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. పంజాబ్, హరియాణా మహిళా కమిషన్లు ఖండించాయి. మహిళలపై జరుగుతున్న నేరాలను అవహేళన చేస్తున్నారని కంగనా సైతం ‘ఎక్స్’ ద్వారా మాన్ వ్యాఖ్యలపై స్పందించారు.
రైతుల ఆందోళనలపై కంగనా చేసిన వ్యాఖ్యలపైన ప్రతిపక్షాలు మండిపడటంతోపాటు సొంత పార్టీ కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమెపై పంజాబ్ మాజీ ఎంపీ, శిరోమణి అకాలీదళ్ (అమృత్‌సర్) నేత సిమ్రాన్‌జీత్‌సింగ్ మాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమైందంటే.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. కంగనా రైతుల ఉద్యమం సమయంలో అత్యాచారం, హత్య ఆరోపణలు చేశారు. దీనిపై మీడియా అకాలీదళ్ నేత సిమ్‌రంజిత్ సింగ్ మాన్‌ని ప్రశ్నించగా.. ‘నేను చెప్పక్కర్లేదు. కానీ రనౌత్ సాహెబ్‌కు రేప్‌లో చాలా అనుభవం ఉంది. రేప్‌లు ఎలా జరుగుతాయో ప్రజలు ఆమెను అడగవచ్చు. మీకు సైకిల్ తొక్కడంలో అనుభవం ఉన్నట్లే.. ఆమెకు రేప్‌లో కూడా అనుభవం ఉంది.” అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కంగనాపై మాన్ అనుచిత వ్యాఖ్యలను పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. మహిళను అవమానించినట్లేనని.. తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కాగా.. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. నెటిజన్లు మాజీ ఎంపీ సిమ్రాన్‌జీత్‌సింగ్ మాన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీనియర్ నాయకుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఈ వ్యాఖ్యలపై కంగనా ఎక్స్ వేదికగా స్పందించారు. “ఈ దేశంలో అత్యాచారాలను చిన్నచూపు చూడటం ఎప్పటికీ ఆగదని అనిపిస్తోంది. ఈరోజు ఈ సీనియర్ రాజకీయ నాయకుడు అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చాడు. ఆడవాళ్ళపై అత్యాచారాలు, హింసలు సరదా కోసం జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ పితృస్వామ్య దేశం యొక్క మనస్తత్వం వారిలో చాలా లోతుగా పాతుకుపోయింది. ఇది ఉన్నత స్థాయి చిత్రనిర్మాత లేదా రాజకీయ నాయకుడైనప్పటికీ.. స్త్రీలను ఆటపట్టించడం లేదా ఎగతాళి చేయడం వంటివి చేసేవారు.” అని రాసుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com